‘సీట్ల పెంపుపై చట్ట సవరణ కసరత్తులో ఉంది’

31 Jul, 2018 01:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం–2014లోని సెక్షన్‌ 26 ప్రకారం తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపునకు అవసరమైన చట్ట సవరణ ప్రతిపాదన కసరత్తులో ఉందని కేంద్ర హోంశాఖ తెలిపింది. అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ గతేడాది డిసెంబర్‌లో ప్రధాని మోదీకి రాసిన లేఖకు బదులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ ఇటీవల లేఖ పంపారు.

‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌–170ని సవరించనంత వరకు ఏపీలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచడం సాధ్యం కాదని అటార్నీ జనరల్‌ అభిప్రాయపడ్డారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం లోని సెక్షన్‌–26 అమలుకు వీలుగా ఆర్టికల్‌ 170 (3)ని, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని రెండో షెడ్యూల్‌  సవరణకు ముసాయిదా కేబినెట్‌ నోట్‌ తయారు చేసి న్యాయ శాఖకు పంపాం.

దానిని న్యాయశాఖ ఏకీభవిస్తూనే ముసాయిదా కేబినెట్‌ నోట్‌ను 2 ముసాయిదా బిల్లులు, ఇతర వివరాలతోపాటు పంపాలని సూచించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ స్థానాల వివరాలను పంపాలని కోరింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ ఉత్తర్వులు–2015లో అసెంబ్లీ స్థానాల పరిధి పెంపు, తగ్గింపు సంబంధిత అంశంలో ఉన్న వ్యత్యాసాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి 2018లో అభిప్రాయాన్ని కోరామని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఏపీ అభిప్రాయం వచ్చిందని, తెలంగాణ స్పం దన కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది’ అని కేంద్ర మంత్రి లేఖలో వివరించారు. 

మరిన్ని వార్తలు