‘ఆజంఖాన్‌ను క్షమించే ప్రసక్తే లేదు’

27 Jul, 2019 16:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  లోక్‌స‌భ‌లో అనుచిత వ్యాఖ్య‌లు చేసిన స‌మాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌ను క్షమించే ప్రసక్తే లేద‌ని డిప్యూటీ స్పీక‌ర్‌, బీజేపీ ఎంపీ ర‌మాదేవి అన్నారు. ఆమె శనివారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆజంఖాన్‌ రెండు సార్లు కుర్చీలో ఉన్న త‌న‌ను అవ‌మానించార‌న్నారు. అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వెంటనే  వెంట‌నే ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్ప‌లేద‌న్నారు. 

(చదవండి : లోక్‌సభలో ఆజం ఖాన్‌ వ్యాఖ్యలపై దుమారం)

‘నేను స‌భ‌లో ఉన్న ప్ర‌తి ఒక్క‌ర్నీ గౌర‌వంగా చూస్తాను. ఆజంఖాన్‌ నావైపు చూస్తు మాట్లాడకుండా నేరుగా ఎంపీల వైపు చూస్తూ మాట్లాడుతున్నారు. అందుకే ఆజంను చైర్ వైపు చూసి మాట్లాడాల‌ని ఆదేశించాను. కానీ ఆయన అది పట్టించుకోకుండా సభలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆయన వ్యాఖ్య‌ల‌కు అప్పుడే కౌంట‌ర్ ఇచ్చేదాన్ని. కానీ, గౌర‌వ‌ప్రదమైన కుర్చీలో కూర్చుని అలా చేయ‌డం త‌గ‌దు అనిపించింది. ప్ర‌తి ఒక‌రికీ త‌ల్లి, సోద‌రి, కుమార్తె, భార్య ఉంటారు.. ఆజం వ్యాఖ్య‌లు మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రడమే కాకుండా పురుషుల గౌరవాన్ని కూడా తగ్గించేలా ఉన్నాయి​’  అని రమాదేవి అన్నారు. 

(చదవండి : ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం)

బీజేపీ ఎంపీ రమాదేవిని ఉద్దేశించి ఎస్పీ నేత ఆజం ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ట్రిపుల్‌ తలాఖ్‌ బిల్లుపై చర్చ సందర్భంగా మీ కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడాలనుకుంటున్నానని రమాదేవిని ఉద్దేశించి ఆజం ఖాన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆజం వ్యాఖ్యలను మహిళా ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ ఓం బిర్లా సైతం ఆజం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగాను సోమవారం లోక్‌సభ స్పీకర్‌ ఎదుట హాజరై, అనంతరం సభలో బేషరతుగా క్షమాపణ  చెప్పాలని ఆజంను ఆదేశించారు. 

మరిన్ని వార్తలు