నారీ..సారీ!

23 Nov, 2018 09:13 IST|Sakshi
సబితా ఇంద్రారెడ్డి సుహాసిని సయ్యద్‌ షహజాదీ

మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురే మహిళా అభ్యర్థులు

గ్రేటర్‌లో సీట్ల కేటాయింపులో అతివలకు తక్కువ ప్రాధాన్యం

కూకట్‌పల్లిలో టీడీపీ నుంచి నందమూరి సుహాసిని

కాంగ్రెస్‌ మహేశ్వరం అభ్యర్థిగా సబితా ఇంద్రారెడ్డి

బీజేపీ అభ్యర్థిగా చాంద్రాయణగుట్ట నుంచి సయ్యద్‌ షహజాదీ

అతివలపై చిన్నచూపు తగదంటూ విమర్శల వెల్లువ

కొన్నిచోట్ల స్వతంత్రులుగా బరిలోకి దిగిన మహిళలు

మహిళలకు అన్నిరంగాల్లోనూ పెద్దపీట వేస్తున్నామని ఉపన్యాసాలు దంచే రాజకీయ నేతలు ఎన్నికల్లో మాత్రం వారికి సరైన న్యాయం చేయడం లేదు. సీట్ల కేటాయింపులో ప్రధాన పార్టీలు కంటితుడుపు విధానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రస్తుత శాసన సభ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలో వారికిచ్చిన టికెట్లే ఇందుకు ఉదాహరణ. కూకట్‌పల్లి నుంచి మహాకూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసిని, మహేశ్వరం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీజేపీ నుంచి చాంద్రాయణగుట్ట అభ్యర్థిగా సయ్యద్‌ షహజాదీలను బరిలో దింపుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు ముగ్గురు మహిళలకే టికెట్లు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి, సిటీబ్యూరో: ఆకాశంలో సగం.. అవకాశాల్లో మాత్రం తీసికట్టే. గ్రేటర్‌ పరిధిలో మహిళామణులకు ప్రధాన పార్టీలు మొండిచేయి చూపాయి. ఎమ్మెల్యేలుగా గెలుపొంది చట్టసభల్లో శాసనాలు చేసే అవకాశం ఇచ్చే విషయంలో ముఖం చాటేశాయి. గెలుపు గుర్రాలను అన్వేషించి గెలిచే అవకాశం ఉన్నవారినే బరిలోకి దింపామన్న సాకుతో అన్నిరంగాల్లో దూసుకుపోతున్న మహిళలను పక్కనబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహానగరంలో కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. కూకట్‌పల్లిలో టీడీపీ, మహేశ్వరంలో కాంగ్రెస్, చాంద్రాయణగుట్టలో బీజేపీ మాత్రమే మహిళలకు అవకాశం కల్పించడం గమనార్హం. మిగతా చోట్ల మహిళలకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల మహిళానేతలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మహిళలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వీరు ఏమేర ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీ ఇస్తారో తేలాల్సి ఉంది.

హైటెక్‌ నగరి.. అవకాశాల్లో నిరాశే..
హైటెక్‌నగరంగా ప్రసిద్ధిచెందిన భాగ్యనగరంలో మహిళలు ఐటీ, బీపీఓ, కేపీఓ, ఏరోస్పేస్, ఏవియేషన్‌ తదితర రంగాల్లో దూసుకుపోతున్నారు. కానీ రాజకీయరంగంలో వారికి అవకాశాలు కల్పించే విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు వివక్షచూపడం గమనార్హం. ప్రధానంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాలుండగా.. వీటిలో ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న మహిళా అభ్యర్థినులు ముగ్గురే కావడం గమనార్హం. వీరు కాక మరో ఇరవై మంది మరికొన్ని నియోజకవర్గాల్లో మహిళలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా సికింద్రాబాద్‌ టిక్కెట్‌ కోసం మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి చివరిదాకా ప్రయత్నించినా.. అనూహ్యంగా ఈ సీటును కాసానికి కట్టెబెట్టడం గమనార్హం.

ప్రధాన పార్టీల టికెట్లు..
మహేశ్వరం నియోజకవర్గం నుంచి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌పార్టీ తరఫున బరిలోకి దిగారు. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ నుంచి నందమూరి సుహాసిని బరిలోకి దిగనున్నారు. చాంద్రాయణగుట్ట నుంచి బీజేపీ అభ్యర్థినిగా బరిలోకి దిగిన సయ్యద్‌ షహజాదీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సికింద్రాబాద్‌ తదితర నియోజకవర్గాల్లో మరికొందరు మహిళలు స్వతంత్రులుగా బరిలోకి దిగినప్పటికీ వారు ప్రధానపార్టీల అభ్యర్థులకు పోటీనిస్తారా లేదా అన్నది ఎన్నికల తర్వాతే తేలనుంది.

మరిన్ని వార్తలు