'ప్రగతి' ప్రదాత ఆమే 'నిర్ణేత'

13 Nov, 2018 01:51 IST|Sakshi

మహిళా ఎమ్మెల్యేలున్న చోట అభివృద్ధి పరుగులు 

నేర చరిత తక్కువ.. శ్రద్ధగా పనిచేయడం ఎక్కువ 

రాజస్తాన్‌లో మహిళలే కీలకం  

వెల్లివిరుస్తున్న చైతన్యం

ఆడది వంటింటి కుందేలనే సామెత ఎప్పుడో పాతదైపోయింది. ఆకాశంలో.. అవకాశంలోనూ సగమని నిరూపిస్తూ అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా దూసుకుపోతున్నారు. భారత్‌ సహా ప్రపంచదేశాల్లో ఈ మార్పు స్పష్టంగా కనబడుతోంది. అయితే అతివలు తక్కువగా రాణిస్తున్న, వీరి ప్రభావం కొంతమేర మాత్రమే కనిపిస్తున్న ఏకైక రంగం రాజకీయమే. పురుషాధిక్య రాజకీయ రంగంలో చోటుకోసం మహిళ ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ.. వీరికి పట్టు చిక్కడం లేదు. ఆడవారికి 33% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండూ అటకెక్కింది. ఇంత జరుగుతుంటే మహిళలు రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఏదైనా సాధించగలిగే సత్తా ఉందా? అని ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వమే. ఎందుకంటే వరల్డ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌ అనే సంస్థ దేశవ్యాప్తంగా జరిపిన పరిశోధనలో అవాక్కయ్యే వాస్తవాలు వెల్లడయ్యాయి. మహిళా ప్రజాప్రతినిధులున్న నియోజకవర్గాలు.. పురుషులతో పోలిస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఈ పరిశోధనలో స్పష్టమైంది. 

భాగస్వామ్యం పెరుగుతోంది 
అసలు రాజకీయ నాయకురాళ్లు దేశ ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యానికి సమర్థులేనా? అనే అంశంపై జరిపిన పరిశోధనలో.. మహిళల సామర్థ్యంపై ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలు ఎమ్మెల్యేలుగా, ఇతర ప్రజాప్రతినిధులుగా ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధిపై జరిపిన పరిశోధనలు సరికొత్త విషయాలను ప్రపంచానికి పరిచయం చేశాయి. ‘ప్రభుత్వ ఖర్చులు, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాల్సిన మొత్తాన్ని నిర్ణయించే అంశాల్లో మహిళా రాజకీయ నేతల భాగస్వామ్యం మెల్లిగా పెరుగుతోందని మా సర్వేలో తేలింది’ అని పరిశోధకులు తెలిపారు. 

అభివృద్ధిలో ముందంజ 
1992 నుంచి 2012 వరకు దేశవ్యాప్తంగా 4,265 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పరిశోధన నిర్వహించారు. దీంట్లో.. మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 4.5% నుంచి 8% పెరిగినట్లు వెల్లడైంది. పురుషులతో పోలిస్తే మహిళా రాజకీయ నేతలకు నేరచరిత తక్కువగా ఉంటోంది. మహిళలు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో పురుష ఎమ్మెల్యేల కన్నా 15.25% అభివృద్ధి ఎక్కువగా జరిగినట్లు వెల్లడైంది. ఈ స్థానాల్లో జీడీపీలోనూ 1.85% ఎక్కువ వృద్ధి కనిపించింది.   

పనిపైనే శ్రద్ధ 
ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లను పరిశీలిస్తే.. పురుషులపై కేసులు మహిళలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. పురుష ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడటం, ఆస్తులు సంపాదించుకోవడం వంటి కార్యక్రమాలపైనే ఆసక్తి చూపుతున్నారు. మౌలిక వసతుల కల్పనలోనూ మహిళా నేతలున్న నియోజకవర్గాలు ముందంజలో ఉన్నాయి. ఇద్దరూ నిధులు తీసుకురావడంలో సమానమైన ఆసక్తులే కనబరుస్తున్నప్పటికీ.. పని పూర్తిచేయడంలో మహిళలు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనికితోడు అనవసర ఖర్చుల్లేకుండా.. ప్రతిపాదిత మొత్తంలోనే ప్రాజెక్టులు పూర్తిచేస్తున్న ఘనత కూడా మహిళలకే దక్కుతోంది.  

 స్ఫూర్తితో ముందుకు 
పనిలో సాధించిన విజయంతో స్ఫూర్తిని ముందుకు పోవడంలోనూ మహిళలో ముందువరుసలో ఉన్నారు. పనిని విభజన చేసుకుని పూర్తి చేయడంలోనూ వీరిదే పైచేయి. అవకాశవాదంగా వ్యవహరించడంలో మహిళల శాతం తక్కువే. ప్రస్తుత భారతదేశంలో 4,118 ఎమ్మెల్యేలుండగా.. మహిళల సంఖ్య 9% మాత్రమే. 2018 జాతీయ ఆర్థిక సర్వే ప్రకారం దేశ జనాభాలో మహిళల సంఖ్య 48.5%. ఆ రాష్ట్రానికి ఒక మహిళ ముఖ్యమంత్రి. అసెంబ్లీలో మహిళా ప్రాతినిధ్యమూ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువే. 2013 ఎన్నికల్లో వసుంధరా రాజేని గద్దెనెక్కించడంలో మహిళలు కీలక పాత్ర పోషించారు. ఈ సారి కూడా మహిళలనే ఆమె నమ్ముకున్నారు. మరి మహిళా ఓటర్లు రాజేను మళ్లీ సీఎం చేస్తారా? వాస్తవానికి ఒకప్పుడు రాజస్తాన్‌లో మహిళలు ఓటరు జాబితాలో కూడా పేరు ఇవ్వడానికి ముందుకురాలేదు. కానీ వసుంధర రాజే ప్రచార శైలి కారణంగా మహిళల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. 

‘మన రాష్ట్రంలో రెండే కులాలు ఉన్నాయి. ఒకటి పురుషులు, రెండు మహిళలు. మహిళా సాధికారత కోసం మేము ఎన్నో పథకాలు తెచ్చాం. ఇక మనం ఎవరి ఎదుట చెయ్యి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి రాదు’ అంటూ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఎన్నికల ర్యాలీల్లో పదే పదే మహిళా ఓటర్లను ఉద్దేశించి చెబుతున్నారు. వసుంధరా రాజేలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఎనలేని ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ, మధ్య మధ్యలో జోకులు వేస్తూ, తన సంభాషణా చాతుర్యంతో ఓటర్లను కట్టిపడేస్తుంటారు. ఎన్నికల సభల్లో ఆమె మాట్లాడుతూ ఉంటే మహిళల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఆమె ఎన్నికల ర్యాలీలకు మహిళలు పోటెత్తుతున్నారు. రాజే పట్ల ఎనలేని ఆరాధనాభావం కనబరుస్తున్నారు. అయితే అన్ని రంగాల్లోనూ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వసుంధర కేవలం మహిళల అండదండలతో అధికారాన్ని సంపాదించుకోగలరా అన్నది ప్రశ్నే. మరోవైపు కాంగ్రెస్‌ కూడా మహిళలే తమ తురుపు ముక్కలంటూ ప్రసంగాలు చేస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మహిళల్ని అందలం ఎక్కిస్తామని, మరో అయిదేళ్లలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో సగం వాటిల్లో మహిళల్నే ముఖ్యమంత్రుల్ని చేస్తామంటూ హామీలైతే గుప్పిస్తున్నారు. కానీ సీట్లు విషయానికొచ్చేసరికి మొండిచేయి ఇస్తు్తన్నారు.  

వెనుకబాటులో మొదటి స్థానం 
బడికి వెళ్లాల్సిన చిన్నారుల కాళ్లకి మెట్టెలు కనిపిస్తాయి. బంగారం లాంటి బాల్యం నాలుగ్గోడల మధ్య నలిగిపోతుంటుంది. బాల్యవివాహాల్లో ఇప్పటికీ రాజస్థానే టాప్‌. మహిళలపై అకృత్యాల్లో మూడో స్థానం. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు నలుగురి మధ్యలోకొచ్చి మాట్లాడరు. ఓటరు జాబితాలో పేరు ఇవ్వడానికీ ఇష్టపడరు. ఓటు వెయ్యడానికి వచ్చినా తండ్రి, భర్త, కొడుకు ఎవరికి వెయ్యమంటే వారికే. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో అక్షరాస్యత కేవలం 52%. చదువులేకపోవడం, చిన్నప్పుడే సంసార భారాన్ని మోయాల్సి రావడం వల్ల మహిళల్లో చైతన్యం తక్కువ. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలతో వేలి చుక్కే వజ్రాయుధం అన్న సంగతి గ్రహిస్తున్నారు. 2013లో మొదటిసారిగా అత్యధికంగా మహిళలు ఓటు వినియోగించుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జలోర్‌ జిల్లా దాదల్‌ గ్రామంలో 2013లో మొదటి సారిగా మహిళలు పోలింగ్‌ బూత్‌ల దగ్గర క్యూ కట్టారు.  

చట్టసభల్లో ఎక్కువే  
రాజస్థాన్‌ మహిళల్లో వెనుకబాటు కనిపించినా చట్టసభల్లో ప్రాతినిధ్యం విషయానికి వచ్చేసరికి ఆ రాష్ట్రం ముందువరసలోనే ఉంది. బీహార్‌ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం రాజస్థానే. మొత్తం 200 స్థానాలున్న అసెంబ్లీలో 2008లో తొలిసారి 29 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 23 మందికి టిక్కెట్లు ఇస్తే, బీజేపీ 32 మందికి ఇచ్చింది. ఇక 2013లో కాంగ్రెస్‌ 24 మందికి ఇస్తే, బీజేపీ 26 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. మొత్తం 27 మంది మహిళలు ఎన్నికైతే అందులో బీజేపీ నుంచే 23 మంది ఎన్నికయ్యారు. రాజేతో పాటు నలుగురు మంత్రులుగా ఉన్నారు.  

రాజే పథకాలు 
అమ్మాయి పుట్టినప్పటి నుంచి యుక్తవయసు వచ్చే వరకు, పెళ్లి నుంచి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేంతవరకు వసుంధర రాజే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. బడికి వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు ఇవ్వడం దగ్గర్నుంచి, నిరుపేద మహిళలకు ఉచితంగా మొబైల్‌ ఫోన్ల వరకు పలు పథకాలు మహిళల మనసుని దోచుకున్నాయి. రాజశ్రీ యోజన , జనని సురక్ష యోజన, మహిళలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరేలా భామాషా యోజన,  ‘ఈ– సఖి’ పేరుతో డిజిటల్‌ అక్షరాస్యతా కార్యక్రమం, మహిళలకు ఉచిత శానిటరీ నాప్‌కిన్స్‌ పంపిణీ,  ఇలా మహిళలకు అండగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అంతకు ముందు అశోక్‌ గెహ్లాట్‌ సీఎంగా ఉన్నప్పుడు కూడా జనని శిశు సురక్ష యాత్ర, శుభలక్ష్మి యోజన వంటి పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ, రాజే తన పథకాలతో మహిళా ఓటర్లను పూర్తిగా తనవైపు తిప్పుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి మద్దతుతో ఈ సారి రాజే గట్టెక్కుతారా వేచి చూడాల్సిందే.     

రాజస్థాన్‌ మొత్తం ఓటర్లు 4.74 కోట్లు  
మహిళా  ఓటర్లు 2.27 కోట్లు  

1972లో వెయ్యి మంది పురుషులకు 723 మహిళలు ఓటు హక్కు వినియోగించుకుంటే  2013 నాటికి వెయ్యి మంది పురుషులకు 899 మంది మహిళలు ఓటు వేశారు.  
2008లో 65% మంది మహిళా ఓటర్లు మాత్రమే ఓటు వినియోగించుకుంటే 2013 వచ్చేసరికి అది 10% పెరిగింది. గత ఎన్నికల్లో 75% మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. (భారత్‌లో మహిళా ఓటర్ల వినియోగం సగటున 65%) 

మహిళా ఓటర్లు పెరగడం వెనక.. 
- పెరుగుతున్న అక్షరాస్యత 
రాజకీయ వార్తలపై ఆసక్తి పెరగడం 
రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనే మహిళల సంఖ్య పెరగడం 
స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం 

లాభమెవరికి? 
మహిళా ఓటర్ల సంఖ్య పెరగడంతో మొదట వీరంతా కాంగ్రెస్‌ వైపు ఆసక్తి చూపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మహిళాధ్యక్షులున్న పార్టీకే ఆడవారి ఓట్లు ఎక్కువగా పడ్డాయి. కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ, యూపీలో మాయావతి, తమిళనాట జయలలిత, పశ్చిమబెంగాల్లో మమత ఈ వర్గం ఓట్లను సంపాదించుకోగలిగారు. అయితే రాను రానూ వీరిలో వస్తున్న మార్పు కారణంగా ఈ ఓటు బీజేపీవైపు మళ్లుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల పురుషుల్లోనూ, మహిళల్లోనూ సరిసమానమైన ఆదరణ కనిపిస్తున్నట్లు లోక్‌నీతి – సీఎస్‌డీఎస్‌ సర్వేలో వెల్లడైంది. మహిళా ఓటర్ల మొగ్గు బీజేపీ వైపు పెరుగుతూ వస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 30% మహిళలు బీజేపీ వైపు ఉంటారన్న సీఎస్‌డీఎస్‌ అంచనా వేసింది.  

మహిళల క్యూ పెరుగుతోంది 
దేశవ్యాప్తంగా మహిళల ఓటింగ్‌ శాతం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలతోపాటు రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీస్‌ (సీఎస్‌డీఎస్‌) అనే సంస్థ చేసిన పరిశోధనలో మహిళల ఓటింగ్‌ శాతానికి సంబంధించి ఆసక్తికర అంశాలు తెలిశాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటింగ్‌ 65.5% కాగా.. పురుషులు 67% మంది ఓట్లు వేశారు. అంటే పురుషుల, మహిళా ఓటర్ల  మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. 

సీఎం అభ్యర్ధులపై క్రిమినల్‌ కేసులు  
మిజోరంలో కాంగ్రెస్, మిజోనేషనల్‌ఫ్రంట్‌ తరఫున సీఎం అభ్యర్థులుగా పోటీ పడుతున్న లాల్‌ థన్‌వాలా, జోరామ్‌తంగపై పెండింగ్‌ క్రిమినల్‌ కేసులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్‌ క్రిమినల్‌ కేసులున్న ఎమ్మెల్యేలు వీరిద్దరే కావడం గమనార్హం. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టులో పిల్‌ వేశారు. ఈ పిల్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు పెండింగ్‌ క్రిమినల్‌ కేసుల వివరాలను గౌహతి హైకోర్టు అందించింది.

ఈ కేసులు నిరూపితమైతే ఈ ఇద్దరు జైలు శిక్ష అనుభవించక తప్పదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో నామినేషన్‌ పేపర్లలో కొన్ని స్థిరాస్తులను దాచిపెట్టి చూపించారని లాల్‌ థన్‌వాలాపై కేసు ఉంది. తనపై ఈ కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు థన్‌వాలా తాజా నామినేషన్‌ పేపర్లలో వెల్లడించారు. ఈ కేసులు నిరూపితమైతే ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడనుంది. ప్రతిపక్ష నేత జోరామ్‌తంగపై రెండు పెండింగ్‌ కేసులున్నాయి. కుట్ర, విధ్వంసం, సాక్ష్యాల విధ్వంసం, అనైతికంగా అధిక ఆస్తులుండడం తదితరనేరాలు ఈకేసుల్లో పోలీసులు ఈయనపై ఆరోపించారు. ఈ కేసులు నిరూపితమైతే ఆయనకు దాదాపు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.

ఎన్నికలపై 12 లక్షల ట్వీట్లు 
ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి గత వారం రోజుల్లో 12 లక్షల ట్వీట్లు రికార్డయ్యాయని సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్‌ తెలిపింది. ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఎలక్షన్‌ ట్వీట్లలో వినియోగించేందుకు ఒక ప్రత్యేక ఎమోజీని సైతం అందుబాటులోకి తెచ్చామని ట్విట్టర్‌ తెలిపింది. ప్రజల్లో ప్రముఖంగా చర్చకు వచ్చే అంశాలకు ప్రాచుర్యం కల్పించే చర్యలు చేపట్టామని తెలిపింది. డిసెంబర్‌ 23 వరకు ప్రజలు AssemblyElections2018  emoji పేరిట ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక ట్వీట్లు చేయవచ్చని తెలిపింది. అన్ని రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్స్‌ కేటాయించామని ట్విట్టర్‌ తెలిపింది. 

వసుంధరా రాజే.. ఫస్ట్‌
దేశంలోనే వరుసగా అత్యధిక కాలం మహిళా సీఎంగా పనిచేసిన రికార్డును రాజస్తాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కూడా కొనసాగుతున్న ఆమె...సోమవారానికి 3,639 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంలో రెండో స్థానంలో ఉన్నారు. ఈమె 2,735 రోజులు మహిళా సీఎంగా పనిచేశారు. ఇంకా కొనసాగుతున్నారు. వివిధ దశల్లో ఎక్కువ రోజులు పనిచేసిన సీఎంగా షీలాదీక్షిత్‌ రికార్డు సొంతం చేసుకున్నారు. ఈమె మొత్తం వివిధ కాలాల్లో 5504 రోజులు సీఎంగా పనిచేశారు. 

వీధినాటకాలు..ఇంద్రజాల ప్రదర్శనలు.. 
సోషల్‌ మీడియాతో ప్రతి ఓటర్‌ను చేరవచ్చని ప్రతి పార్టీ భావిస్తున్న తరుణంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు మధ్యప్రదేశ్‌ బీజేపీ కొత్తపంథా అవలంబిస్తోంది. నవీన సాంకేతికత ఆధారంగా పనిచేసే సోషల్‌ మీడియాతో పాటు సాంప్రదాయ రూపాలైన వీధినాటకాలు, ఇంద్రజాల ప్రదర్శనలతో ఓటర్లను ఆకట్టుకోవాలని నిర్ణయించింది. చిన్న పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వీధినాటకాలు, ఇంద్రజాల ప్రదర్శనల ద్వారా తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రచారం చేయనుంది. ఇందులో భాగంగా పార్టీ ఆఫీసుకు పలు డ్రామా గ్రూపులను, ఇంద్రజాలికులను పిలిపించి వారిలో సరైనవారిని ఎంచుకొంది. ఇలా ఎంపికైన వారు ఇకమీదట రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు పయనమై బీజేపీ ప్రభుత్వం చేపట్టినఅభివృద్ధి పనులను ప్రజలకు వీధినాటకాల రూపంలో వివరించనున్నారు.

ఎంతో వడపోత అనంతరం తాను ఎంపికయ్యానని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అందించిన ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తానని ఒక కళాకారుడు చెప్పాడు. ఈ విధంగా సాంప్రదాయ కళారూపాలను పార్టీ ప్రచారానికి వాడుకోవడం గతంలో కూడా చేశామని బీజేపీ ప్రతినిధి చెప్పారు. వీధినాటకాల కళాకారులతో పాటు ఆరుగురు ఐంద్రజాలికులను కూడా పార్టీ ప్రచారం నిమిత్తం ఎంచుకున్నట్లు చెప్పారు. 2013 ఎన్నికల్లో కూడా చౌహాన్‌ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేందుకు ఇదే తరహాలో మ్యాజిక్‌ ప్రదర్శకులను ఎంచుకున్నామని, గుజరాత్‌ గత ఎన్నికల్లో సైతం ఇలా కళారూపాలతో ప్రదర్శనలు జరిపామని పార్టీ వర్గాలు చెప్పాయి. వీటి ద్వారా మరింత ప్రభావంతంగా ప్రజల్లోకి వెళ్తామన్నాయి.  

మరిన్ని వార్తలు