ఆదాయంలో ధనాధన్‌ 

13 Nov, 2018 02:04 IST|Sakshi

లాభాల బాటలో దక్షిణ మధ్య రైల్వే

6 నెలల్లో గణనీయమైన వృద్ధి

గతేడాదికంటే అదనంగా వచ్చిన ఆదాయం 846కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆదాయంలో దూసుకుపోతోంది. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఆరు నెలల కాలంలో ఆదాయంలో గణనీయమైన పురోగతి సాధించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ 6 నెలల కాలంలో దాదాపు రూ.846 కోట్ల ఆదాయంతో ఏకంగా 18 శాతం వృద్ధిరేటు కనబరచడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు దక్షిణ మధ్య రైల్వే ప్యాసింజర్, సరుకు రవాణాలను కలిపి రూ.7,017 కోట్ల ఆదాయం సాధించింది. ఇదేకాలానికి 2017లో వచ్చిన ఆదాయం రూ.6,171 కోట్లు కావడం గమనార్హం. ఆదాయ వృద్ధిరేటు 18 శాతానికి చేరడం శుభపరిణామమని, మునుముందు మరింత పురోగతి సాధిస్తామని అధికారులు అంటున్నారు.  

కారణాలివే.. 
దక్షిణ మధ్య రైల్వేకు ఆదాయం పెరగడానికి కారణాలను సీపీఆర్వో ఉమాశంకర్‌ వివరించారు. తమ జీఎం వినోద్‌కుమార్‌ నేతృత్వంలో అంతా ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ 10 లక్షల మందికి సేవలందించే దక్షిణ మధ్య రైల్వేను ప్రయాణికులకు మరింతగా దగ్గర చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. రాబోయే 6 నెలల్లోనూ మరిన్ని లాభాలు సాధించేందుకు రైల్వేలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నామని స్పష్టంచేశారు. వాటిలో ప్రధానమైనవి..  

ప్రయాణికుల పరంగా.. 
- పలు దూర ప్రాంతాలకు రైళ్ల పొడిగింపు, హైదరాబాద్‌లో శేరిలింగంపల్లి టెర్మినల్‌ అభివృద్ధి చేయడం, అక్కడ నుంచి 6 కొత్త రైళ్లు నడపడం. 
రద్దీకి అనుగుణంగా రైళ్లు, పర్వదినాల్లో ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీలు వేయడం 
​​​​​​​- టికెట్‌ రహిత ప్రయాణంపై అవగాహన, దాడులు నిర్వహించడం 
​​​​​​​- అన్ని రైల్వేస్టేషన్లలో భద్రతా, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడం 

రవాణా విషయంలో
​​​​​​​- గూడ్స్‌ ట్రెయిన్ల వేగం పెంచడం, బొగ్గు, సిమెంటు తదితర పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను గడువులోగా గమ్యాన్ని చేర్చడం.  
​​​​​​​- ఉత్పత్తుల రవాణాలో ప్రైవేటు కంపెనీలకు ఫ్లెక్సిబిలిటీని ఇవ్వడం. 
​​​​​​​- వ్యాగన్ల సామర్థ్యాన్ని 58 నుంచి 65 టన్నులకు పెంచడం, రైళ్ల సామర్థ్యాన్ని కూడా 52 వ్యాగన్ల నుంచి 60కిపైగా వ్యాగన్లకు పెంచడం.  

మరిన్ని వార్తలు