మళ్లీ ఏచూరినే...

22 Apr, 2018 14:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి (65) మరో దఫా ఎన్నికయ్యారు. 22వ జాతీయ మహాసభల్లో భాగంగా చివరి రోజు(ఆదివారం) జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు 92 సభ్యులున్న కేంద్ర కమిటీ సంఖ్యను 95కు పెంచుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం కేంద్ర కమిటీలో తమ్మినేని, వీరయ్యలు కొనసాగుతుండగా.. ఇప్పుడు నాగయ్య(తెలంగాణ)కు చోటు దక్కింది.

ఇక భేటీ అనంతరం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. సమావేశ వివరాలను వివరించిన ఆయన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు.. సీపీఎంలో నెలకొన్న విభేదాల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. అయితే తామంతా ఏకతాటిగా ముందుకు సాగేందుకు నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. ఐదు రోజులపాటు జరిగిన హైదరాబాద్‌లో జరిగిన జాతీయ మహాసభల్లో ఆఖరి రోజైన నేడు పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నేటి సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో బహిరంగ సభ జరుగుతుండగా.. కాసేపట్లో మలక్‌పేట్‌ నుంచి సభ వేదిక వరకు రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు కొనసాగనుంది.

>
మరిన్ని వార్తలు