'అశోక్‌గజపతి రాజు సమాధానం చెప్పాల్సిందే'

3 Feb, 2018 13:56 IST|Sakshi

సాక్షి, విజయనగరం : విజయనగరం జిల్లా అవినీతి కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పాలుపంచుకున్నారని, ఎయిర్‌పోర్ట్‌ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో అశోక్‌ గజపతి రాజు సమాధానం చెప్పి తీరాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మజ్జి శ్రీనివాసరరావు డిమాండ్‌ చేశారు. తాను కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకుంటున్న ఆయన కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్‌ విషయంపై మజ్జి శ్రీనివాసరరావు శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ హామీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం గిరిజన యూనివర్సిటీ, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కల నెరవేరలేదని మండిపడ్డారు.

ఇప్పటి వరకు ఐదు బడ్జెట్లు అయ్యాయని, విభజన హామీలను సాధించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. సామాన్యులు, యువత, కార్మికుల ఆశలు ఆడియాసలు అయ్యాయని, ముమ్మాటికి ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రుల వైఫల్యమే అన్నారు. బడ్జెట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సి ఉన్నా అలా జరగలేదని చెప్పారు. ఎన్నికల సమయంలో తిరిగి అధికారం రాబట్టుకోవడం కోసం మనోభావాలు తాకట్టుపెట్టారని మండిపడ్డారు. ఈ నెల 10న ఉత్తరాంధ్రలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలతో విజయనగరంలో కార్యక్రమం ఏర్పాటుచేసి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు