‘ఓడినా.. బాబు గుణపాఠంగా తీసుకోలేదు’

23 Jan, 2020 20:56 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: విశాఖపట్నం, అమరావతి, కర్నూలు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్‌ కాగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. జిల్లాలోని వైస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఇందుకోసం అనేక మంది నిపుణులతో చర్చించి శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ జరగాలని ఆయన ఆకాంక్షించారని తెలిపారు. గతంలో రాజధాని అంశంలో జరిగిన తప్పులు మరలా జరగకూడదన్నది సీఎం జగన్‌ ఉద్దేశమని  తెలిపారు. వనరులు తీసుకు వెళ్లి హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడితే చివరకు విభేదాలతో విడిపోయామని, హైదరాబాద్‌ తరహాలో రాబోయే తరాలకు అన్యాయం జరగకుండా ఉండాలన్నదే సీఎం జగన్‌ ఆలోచన అని పేర్కొన్నారు. వ్యవస్థలను మ్యానేజ్‌ చేసే వ్యక్తి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అని రాజా మండిపడ్డారు. జన్మభూమి కమిటీలతో స్థానిక వ్యవస్థలను చిన్నా భిన్నం చేశారని, 2019 ఎన్నికల్లో ఓడినా చంద్రబాబు గుణపాఠంగా తీసుకోలేదని, అయినా ఆయన వ్యక్తిత్వం, ఆలోచనలో ఏమాత్రం మార్పు రాలేదని రాజా విమర్శించారు.

చంద్రబాబు ప్రజల కోసం కాకుండా.. ఆయన స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని రాజా ఫైర్‌ అయ్యారు. ఇక శాసనమండలి చైర్మన్‌ను ప్రభావితం చేసిన వ్యక్తి చంద్రబాబు అని.. ఆయన వికృత చేష్టలకు ఆంధ్రప్రదేశ్‌ జనం బాధపడుతున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా 13 జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. జనవరి 25 నుంచి 30 వరకు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాజా తెలిపారు. 25వ తేదిన చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తామన్నారు. 26న అంబేద్కర్‌ రాజ్యాంగంలో తెలిపిన వికేంద్రీకరణ అంశాన్ని ప్రజలకు తెలిజేచయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా 27న భారీ బైక్‌ ర్యాలీ, 28న జిల్లాలోని యూనివర్శిటీ సదస్సులను నిర్వహించి సీఎం వికేంద్రీకరణ అంశాలపై ప్రసంగాలు చేస్తామన్నారు. 29న ప్రధాన కూడళ్లలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 30వ తేదీన రాష్ట్రపతికి పోస్టుకార్డుల ద్వారా తమ ఆకాంక్షను తెలియజేయనున్నట్లు రాజా తెలిపారు. ఇక 31వ తేదీన మూడు జిల్లాల జేఎసీలు ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్లు జక్కంపూడి రాజా తెలిపారు.

మరిన్ని వార్తలు