దూసుకొచ్చిన మృత్యువు

9 Jan, 2018 08:52 IST|Sakshi

రోడ్డు పక్కన పాలు విక్రయిస్తున్న వ్యక్తిని ఢీకొట్టిన లారీ  

అక్కడికక్కడే దుర్మరణం..

నుజ్జునుజ్జయిన మరో కారు  

పోలీసుల అదుపులో లారీ డ్రైవర్, క్లీనర్‌

తాండూరు టౌన్‌ : బతుకుదెరువు కోసం తెల్లవారుజామునే నిద్రలేచి పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తిని మృత్యువులా దూసుకొచ్చిన లారీ బలిగొన్నది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ ప్రతాప్‌లింగం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం షావుకార్‌పేట్‌కు చెందిన శ్రీశైలం (40) నాపరాతి పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. జీవనాధారం కోసం ప్రతినిత్యం తెల్లవారుజామున తాండూరు బస్టాండు సమీపంలో పాల ప్యాకెట్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం కూడా యధావిధిగా అక్కడ పాలు విక్రయిస్తున్నాడు.

కాగా నెల్లూరు నుంచి చెట్టినాడ్‌ సిమెంటు కర్మాగారానికి బొగ్గు లోడ్‌తో కొడంగల్‌ రోడ్డు నుంచి ఇందిరాచౌక్‌ వైపునకు లారీ వస్తున్నది. ముందు వెళ్తున్న మరో లారీని ఎడమ వైపు నుంచి లారీ డ్రైవర్‌ ఓవర్‌ టేక్‌ చేయబోగా పక్కనే ఉన్న లారీకి తగిలింది. దీంతో అదుపుతప్పిన లారీ రోడ్డుకు ఓ మూలన పాల ప్యాకెట్లు విక్రయిస్తున్న శ్రీశైలంను ఢీకొట్టింది. అనంతరం బాలాజీ లాడ్జి ముందు పార్కింగ్‌ చేసి ఉన్న పవర్‌ప్లాంట్‌కు చెందిన ఓ వ్యక్తికి చెందిన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగం, నిర్లక్ష్యంతో లారీ నడిపి వ్యక్తి మృతికి కారకుడైన డ్రైవర్‌ విజయ్‌నాథ్‌తో పాటు క్లీనర్‌ కాళేశ్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి లారీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు