దైవ దర్శనం కోసం వెళ్తూ.. లారీ ఢీకొని బాలుడి దుర్మరణం..

28 Aug, 2023 09:04 IST|Sakshi

మహబూబ్‌నగర్‌: దైవ దర్శనం కోసం కుటుంబంతో కలిసి ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో రాయాపురం సమీపంలో లారీ రూపంలో బాలుడిని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. బింగిదొడ్డితండాకు చెందిన వీరేష్‌నాయక్‌, లక్ష్మి దంపతుల కుమారుడు గౌతమ్‌ (6)తో పాటుగా ఏడేళ్ల బాలిక పరిణికతో కలిసి ద్విచక్ర వాహనంపై ఉరుకుంద వీరన్న స్వామి దర్శనం కోసం బయలుదేరారు.

వీరు రాయాపురం దాటి గట్టు వైపు వస్తుండగా, రాయాపురం స్టేజీ వద్ద ఉన్న భారత్‌మాల రోడ్డు నిర్మాణం క్యాంపులో సిమెంట్‌ బస్తాలను దింపి గద్వాల వైపు వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో గౌతమ్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. వీరేష్‌నాయక్‌, లక్ష్మి తీవ్రంగా గాయపడగా, పరిణిక స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ లారీని ఆపకుండా పరారయ్యాడు.

చుట్టు పక్కల రైతులు విషయాన్ని గుర్తించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని గద్వాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నందికర్‌ పోలీస్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరకున్నారు.

గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పరిస్థితి చేయిదాటకుండా కేటిదొడ్డి ఎస్‌ఐ వెంకటేష్‌, మల్దకల్‌ ఎస్‌ఐ కల్యాణ్‌, అయిజ ఎస్‌ఐ నరేష్‌ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆందోళనకారులకు నచ్చ చెప్పారు. దీంతో గ్రామస్తులు శాంతించారు.

ఉండవెల్లి వద్ద పట్టుబడ్డ లారీ..
రాయాపురం వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీని హైదరాబాద్‌–కర్నూలు జాతీయ రహదారి ఉండవెల్లి వద్ద పట్టుకున్నట్లు ఎస్‌ఐ నందికర్‌ తెలిపారు. చుట్టుపక్కల పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రమాదానికి కారణమైన లారీ వివరాలను సేకరించి, జీపీఎస్‌ ఆధారంగా గద్వాల, ఎర్రవల్లి మీదుగా జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని ఉండవెల్లి పోలీసుల సహకారంతో పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు