మనిషి సంతోషంగా ఉండాలంటే ఇంతకంటే ఏం కావాలి!

24 Dec, 2018 18:51 IST|Sakshi

ఈ ఏడాది అత్యంత ఆకర్షణీయ పరిణయ వేడుక ఎవరిది అంటే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది బీ- టౌన్‌ స్టార్‌ కపుల్‌ దీపికా పదుకోన్‌- రణ్‌వీర్‌ సింగ్‌, గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా- అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌, భారతీయ కుబేరుడు ముఖేష్‌ అంబానీ కూతురు ఇషా అంబానీ- ఆనంద్‌ పిరమాల్‌ల పెళ్లి గురించే. అయితే రెండేసి సంప్రదాయ పద్ధతుల్లో వివాహం చేసుకుని... పలు రిసెప్షన్‌ పార్టీలతో సందడి చేసిన దీప్‌వీర్‌, ప్రియానిక్‌ల ఫొటోలు ఓవైపు.. దేశంలో అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా నిలిచిన ఇషా పరిణయం విశేషాలు మరోవైపు సోషల్‌ మీడియాలో హల్‌చేశాయి. అయితే అత్యంత ఆడరంబరంగా జరిగిన ఈ పెళ్లి వేడుకల కంటే కూడా అతి సాధారణంగా జరిగిన రిజ్వాన్‌ అనే వ్యక్తి పెళ్లే తమ మనసులను దోచిందంటున్నారు కొందరు నెటిజన్లు. ట్విటర్‌లో రిజ్వాన్‌ రాసుకొచ్చిన వెడ్డింగ్‌ స్టోరీ చదివి ఫిదా అవుతున్నారు.

నా పెళ్లి బడ్జెట్‌ రూ. 20 వేలు
‘గయ్స్‌ ఇది పెళ్లిళ్ల సీజన్‌ కదా. అందుకే నాకు నచ్చినట్టుగా జరిగిన నా పెళ్లి విశేషాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా ఇంటి టెర్రస్‌ వేదికగా.. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా మొత్తం 25 మంది అతిథితుల మధ్య నా వివాహం జరిగింది. ఇక భోజనం విషయానికి వస్తే చికెన్‌ టిక్కా, సీఖ్‌ కబాబ్‌, పథూరీ చనాయ్‌ హల్వా, స్ట్రాబెర్రీస్‌ వడ్డించాం. అన్నింటికీ కలిపి మొత్తం దాదాపుగా 20 వేల రూపాయల బడ్జెట్ వేసుకున్నా. నా భార్య నేను అతి సాధారణమైన దుస్తులు ధరించాం. అవి కూడా మా అమ్మ, సోదరి మాకు కానుకలుగా ఇచ్చినవే. ఇంతకీ నేను చెప్పుచ్చేది ఏమిటంటే... సరే పర్లేదు. ఎలా అయితేనేం కావాల్సిన వాళ్ల మధ్య నాకు సాధ్యమయ్యే బడ్జెట్‌లో, సౌకర్యవంతమైన పద్ధతిలో ఆనందోత్సాహాల మధ్య ‘పెళ్లి వేడుక’ జరిగింది. ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే ఇంతకంటే ఏం కావాలి. ఏదేమైనా పెళ్లిళ్లన్నీ ఆనందదాయక జీవితానికి చిరునామాగా నిలవాలి’ అంటూ రిజ్వాన్‌ తన ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

రిజ్వాన్‌ ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు... ‘ మనల్ని నిజాయితీగా ప్రేమించే వ్యక్తుల మధ్య... వారి ఆశీర్వాదాలతో జరిగే ఇలాంటి పెళ్లి నిజంగా ఎంతో బాగుంటుంది. ఆర్భాటాలతో సంబంధం లేకుండా కేవలం బంధానికి విలువనివ్వడం కొంతమందికే చెల్లుతుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది తమకు నచ్చిన, ఆకర్షణీయమైన పెళ్లి వేడుక నీదే అంటూ రిజ్వాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరిన్ని వార్తలు