ఏ వర్షం.. మాంచెస్టర్‌ను వీడొచ్చుకదా!

16 Jun, 2019 13:58 IST|Sakshi

భారత్‌లో ఎండలతో చస్తున్నాం.. ఇక్కడ పడొచ్చు కదా

సోషల్‌ మీడియాలో భారత అభిమానుల కామెంట్స్‌

హైదరాబాద్‌ : భారత్‌-పాకిస్తాన్‌ ప్రపంచకప్‌ను ఆస్వాదించాలని భావించిన అభిమానులకు వర్షం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో వర్షం కారణంగా 4 మ్యాచ్‌లు రద్దయ్యాయి. అభిమానులు కూడా ఐసీసీపై తమ ఆగ్రహం వెళ్లగక్కారు. కివీస్‌తో మ్యాచ్‌ పోయినా పెద్దగా పట్టించుకోలేదు కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్‌ మాత్రం కచ్చితంగా జరగాలని అంతా కోరుకుంటున్నారు. అయితే నేడు (ఆదివారం) జరిగే మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారుతుందనే వాతావరణ రిపోర్టులతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తమ అసహనాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

కొందరు ఈ వర్షంకు ఏ పనిలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు వర్షాన్ని ఈ ఒక్క రోజు  విశ్రాంతి తీసుకోమని బతిమలాడుతున్నారు. ఇంకొందరైతే టీమిండియా ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ తరహాలో పడే వర్షం ఏదో.. ఎండలతో చస్తున్న మా దగ్గర పడొచ్చు కదా.. అని కామెంట్‌ చేస్తున్నారు. కివీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా జాదవ్‌.. ఈ వర్షం నాటింగ్‌హామ్‌లో కాకుండా కరువుతో తాండవిస్తోన్న మహారాష్ట్రలో పడాలని కోరుకున్న విషయం తెలిసిందే. అయితే అభిమానులు కోరుకున్నట్లుగానే వరణుడు కరుణిస్తున్నట్లున్నాడు. ప్రస్తుతం అక్కడ వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వర్షం పడే అవకాశాలు కూడా 60 నుంచి 40 శాతం తగ్గినట్లు వెదర్‌ రిపోర్ట్స్‌ పేర్కొంటున్నాయి. 

మరిన్ని వార్తలు