నేను పొరపాటు చేశా: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అంపైర్‌

21 Jul, 2019 17:46 IST|Sakshi

దుబాయ్‌: వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓవర్‌ త్రో విషయంలో తాను పొరపాటు చేశానని ఆ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన కుమార్‌ ధర్మసేన ఒప్పుకున్నాడు. బెన్‌ స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలిన బంతి ఓవర్‌ త్రోగా బౌండరీకి వెళ్లడంతో దానికి ఆరు పరుగులు ఇవ్వడం తాను చేసిన పొరపాటని, ఇందుకు చింతిస్తున్నానని అన్నాడు. దీనిపై మ్యాచ్‌ అధికారులతో పాటు ఫీల్డ్‌లోనే ఉన్న మరొక అంపైర్‌ ఎరాస్మస్‌తో చర్చించిన తర్వాతే ఆరు పరగులు ఇచ్చానంటూ తెలిపాడు. ఇది తాను చేసిన అతి పెద్ద తప్పిదమని టీవీ రిప్లేలో చూసిన తర్వాత కానీ అర్థం కాలేదన్నాడు.

‘నేను తప్పిదం చేసిన విషయాన్ని అంగీకరిస్తున్నా. మ్యాచ్‌ ముగిసిన తర్వాత టీవీ రిప్లేలో చూస్తే నేను చేసిన పొరపాటు తెలిసింది. ఇందుకు నేను చాలా చింతిస్తున్నా. ఇక్కడ క్షమాపణలు కోరడానికి కూడా అర్హుడిని కానేమో. ఆ మ్యాచ్‌కు సంబంధించిన అధికారులతో చర్చించిన తర్వాత అది ఆరు పరుగులుగా ప్రకటించా. లెగ్‌ అంపైర్‌ ఎరాస్మస్‌తో కూడా చర్చించా. బ్యాట్స్‌మన్‌ రెండో పరుగును పూర్తి చేశాడని అంతా భ్రమపడి ఆ త్రోకు అదనంగా మరో నాలుగు పరుగులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలోనే దాన్ని మ్యాచ్‌ అధికారులు రిప్లేలో చూడకపోవడంతో పొరపాటు జరిగింది’ అని ధర్మసేన పేర్కొన్నాడు. 

వరల్డ్‌కప్‌ తుది సమరంలో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 241 పరుగులు చేయగా, లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఇంగ్లండ్‌ కూడా 50 ఓవర్లలో 241 పరుగులే చేసింది.  గప్టిల్‌ విసిరిన త్రో బెన్‌ స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీ దాటగా అంపైర్‌ ధర్మసేన ఆరు పరుగులు ప్రకటించడం, బ్యాటింగ్‌ కొనసాగించిన స్టోక్స్‌ ఆ తర్వాత మ్యాచ్‌ను ‘టై’ వరకు తీసుకురావడం జరిగాయి. స్టోక్స్‌ రెండు పరుగు పూర్తి చేయకుండానే బంతి అతని బ్యాట్‌ తగిలి బౌండరీకి వెళ్లింది. వాస్తవానికి దానికి 5 పరుగులే ఇవ్వాలి. అయితే ఆ బౌండరీతో కలిపి మొత్తంగా ఆరు పరుగులు ఇచ్చారు. దాంతో మ్యాచ్‌ టైగా ముగిసి సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. కాగా, సూపర్‌ ఓవర్‌ కూడా టై కావడంతో అధిక బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను చాంపియన్‌గా ప్రకటించారు. 

మరిన్ని వార్తలు