ప్రధానమంత్రి  పక్క సీటు!

17 May, 2019 01:38 IST|Sakshi

బీసీసీఐకి అంబానీ షరతు

తొలి మూడు ప్రపంచ కప్‌లు ఇంగ్లండ్‌లో నిర్వహించిన తర్వాత దానిని ఆసియా ఖండానికి తరలించడం అంత సులువుగా జరగలేదు. 1987లో భారత్, పాకిస్తాన్‌ సంయుక్తంగా ‘రిలయన్స్‌ వరల్డ్‌ కప్‌’కు ఆతిథ్యమిచ్చాయి. ఐసీసీలో మాట నెగ్గేందుకు అసోసియేట్‌ దేశాలకు భారీ మొత్తాన్ని ఆఫర్‌ చేయాల్సి వచ్చింది. రెండు దేశాల క్రికెట్‌ పరిపాలకులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల మధ్య పలుమార్లు చర్చోపచర్చలు సాగాయి. నిర్వహణ కోసం ఇండియా పాకిస్తాన్‌ జాయింట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఐపీజేఎంసీ) ఏర్పాటు చేశారు. అంతా జరిగాక స్పాన్స ర్‌షిప్‌ కోసం ప్రయత్నిస్తే లండన్‌లో స్థిరపడిన ఒక భారతీయ వ్యాపారి ముందుకు వచ్చాడు. అయితే ప్రధాని రాజీవ్‌ గాంధీకి ఇది నచ్చలేదు. భారత్‌లో జరిగే  టోర్నీకి మళ్లీ విదేశీ వ్యక్తి టైటిల్‌ స్పాన్సర్‌ కావడం ఏమిటని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

దాంతో చివరకు ఐఎస్‌ బింద్రా, అప్పటి కేంద్ర మంత్రి ఎన్‌కేపీ సాల్వే కలిసి రిలయన్స్‌ అధినేత ధీరూభాయ్‌ అంబానీని ఒప్పించారు. డబ్బు గురించి కాకుండా తన ముందు ఒక షరతు విధించి అంబానీ స్పాన్సర్‌షిప్‌పై సంతకం చేశారని బింద్రా వెల్లడించారు. ‘ప్రపంచకప్‌కు ముందు భారత్, పాకిస్తాన్‌ మధ్య ఒక ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ జరగబోతోంది కదా. దేశవ్యాప్తంగా టీవీలో ఆ మ్యాచ్‌ ప్రత్యక్షంగా ప్రసారమవుతుంది. ఆ మ్యాచ్‌ జరిగే సమయంలో ప్రధానమంత్రి పక్కనే నాకు సీటు ఏర్పాటు చేయాలనేది నా షరతు’ అని అంబానీ తన మనసులో మాట చెప్పారు. ఐపీజేఎంసీ కాస్తా రిలయన్స్‌ కప్‌ ఆర్గనైజింగ్‌ కమిటీగా పేరు మార్చుకుంది. 1987 వరల్డ్‌ కప్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం నాడు రిలయన్స్‌ సంస్థ రూ. 9 కోట్లు చెల్లించింది!

మరిన్ని వార్తలు