కౌంటీలకు భారత క్రికెటర్లు

20 Apr, 2019 04:16 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన ఏడుగురు టెస్టు క్రికెటర్లు ఇంగ్లిష్‌ కౌంటీల్లో ఆడనున్నారు. చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే, పృథ్వీ షా, హనుమ విహారి, మయాంక్‌ అగర్వాల్, రవిచంద్రన్‌ అశ్విన్, ఇషాంత్‌ శర్మలు విండీస్‌తో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ సిరీస్‌కు ముందు కౌంటీ క్రికెట్‌ ఆడతారని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. వీరిలో పుజారాకు ఇప్పటికే యార్క్‌షైర్‌తో మూడేళ్ల ఒప్పందం ఉంది. దీంతో అతను ఆ జట్టుతో కొనసాగుతాడు. త్వరలో బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) నుంచి ఆమోదం రాగానే రహానే హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలున్నాయి. ప్రపంచకప్‌ ముగిశాక జూలై, ఆగస్టులో టెస్టు చాంపియన్‌షిప్‌ సిరీస్‌ జరుగుతుంది. అందుకోసం భారత ఆటగాళ్లకు విదేశీ గడ్డపై మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కల్పించాలని బోర్డు భావించింది. దీంతో లెస్టర్‌షైర్, ఎస్సెక్స్, నాటింగ్‌హమ్‌షైర్‌లతో బీసీసీఐ సంప్రదింపులు జరిపింది. మూడు, నాలుగు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిస్తే టెస్టు క్రికెటర్లకు మేలు జరుగుతుందని బోర్డు భావించిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గతేడాది ఇంగ్లండ్‌లో భారత పర్యటనకు ముందే అక్కడ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సర్రేతో కౌంటీ క్రికెట్‌ ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ గాయం కారణంగా కోహ్లి కౌంటీలు ఆడలేకపోయాడు.

మరిన్ని వార్తలు