పక్కా ప్రపంచకప్‌ ఆడుతా: రహానే

4 Nov, 2018 10:53 IST|Sakshi
అజింక్యా రహానే (ఫైల్‌ ఫొటో)

ముంబై : గత ఫిబ్రవరి నుంచి వన్డేలకు దూరంగా ఉన్న టీమిండియా టెస్ట్‌ వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే 2019 ప్రపంచకప్‌ పక్కా ఆడుతానని ధీమా వ్యక్తం చేశాడు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘త్వరలోనే టీమిండియా వన్డే జట్టులో చోటుదక్కుతుంది. కచ్చితంగా 2019 ప్రపంచకప్‌ టోర్నీ ఆడుతాననే నమ్మకం ఉంది. ఇది జరగాలంటే డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడటం ఎంతో ముఖ్యం. నా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో ఎలాంటి సమస్య లేదు. కొన్ని సార్లు అద్భుతంగా ఆడామనుకున్నా ఫలితం మనకు ప్రతికూలంగా ఉంటుంది. స్పిన్‌ బౌలింగ్‌ను ఎలా సమర్ధవంతంగా ఎదుర్కోవాలనే అంశంపై కసరత్తులు మొదలు పెట్టా. ఇప్పటికే ఈ విషయంలో చాలా మెరుగయ్యాను. అందుకే నేను డొమెస్టిక్‌ టోర్నమెంట్స్‌ ఆడుతున్నాను. దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి రెండు టెస్టులకు జట్టులో చోటుదక్కకపోవడంతో బాధపడలేదు. అలా అయితే ఏంచేయలేం. అది మనచేతులో ఉండదు. టీమ్‌మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని మనం గౌరవించాలి. నాకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతోనే ఎదురు చూశా.’ అని తెలిపాడు. (చదవండి: ధోని లేకుండానే... ధనాధన్‌కు)

బేసిక్స్‌, షాట్స్‌ ఆడటం తెలిసుంటే ఏ ఫార్మాటైనా మారుతూ సులువుగా ఆడవచ్చని, ఒకే ఫార్మాట్‌ ఆడితే ఇంకా బాగా రాణించవచ్చని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనకు పదిరోజులు ముందుగా వెళ్లనున్నామని, అక్కడ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా ఆడునున్నామని తెలిపాడు. ఏ దేశాన్నైనా వారి సొంతగడ్డపై ఎదుర్కోవడం కొంచెం కష్టంతో కూడుకున్న పనేనని, ఇరు జట్లలో మంచి బౌలింగ్‌ అటాక్‌ ఉందని, ఈ సిరీస్‌ రసవత్తరంగా సాగనుందని పేర్కొన్నాడు. తన దృష్టిలో బుమ్రా కష్టమైన బౌలరని, ఉమేశ్‌ అత్యంత వేగమైన బౌలర్‌ని రహానే చెప్పుకొచ్చాడు. ఇక 2016 నుంచి వన్డేల్లో 48 ఇన్నింగ్స్‌లు ఆడిన రహానే కేవలం మూడు సెంచరీలు, 8 హాఫ్‌ సెంచరీలు మాత్రమే చేశాడు. (చదవండి: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు..)

మరిన్ని వార్తలు