కుక్‌ తీసిన ఏకైక వికెట్‌ అదే

4 Sep, 2018 12:52 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ మాజీ సారథి, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అలిస్టర్‌ కుక్‌ తన కెరీర్‌ చివరి మ్యాచ్‌కు ముహూర్తం ప్రకటించిన విషయం తెలిసిందే. టీమిండియాతో జరిగే  ఏ ఇతర ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యంకాని ఎన్నో రికార్డులు, మరెన్నో అవార్డులు అతని సొంతం. క్రీజులో నిలదొక్కుకుంటే చాలు బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ.. స్కోర్‌ బోర్డు పరిగెత్తించేవాడు. ఇక ఫీల్డింగ్‌లో కూడా చురుగ్గా ఉంటూ స్లిప్‌లో ఎన్నో మరుపురాని క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ లెఫ్టాండ్‌ బ్యాట్స్‌మన్‌ బౌలింగ్‌ చేయడం చాలా అరుదు. అతను ఆడిన 160 టెస్టుల్లో 26,086 బంతులను ఎదుర్కొని 12254 పరుగుల చేయగా..  కేవలం 18 బంతులే బౌలింగ్‌ చేసి ఒక్క వికెట్‌ సాధించాడు. ఆ ఔట్‌ చేసింది కూడా టీమిండియా బౌలర్‌ ఇషాంత్‌ శర్మనే కావడం విశేషం.

2014లో ఎంఎస్‌ ధోని నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు కుక్‌ తన తొలి అంతర్జాతీయ వికెట్‌ సాధించాడు. తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా లోయార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ భువనేశ్వర్‌-ఇషాంత్‌ శర్మలు ప్రత్యర్థి బౌలర్లకు కొరకరానికొయ్యలా తయారయ్యారు. దీంతో ఈ జోడిని విడదీయడానికి అప్పటి కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ రంగంలోకి దిగాడు. విభిన్నమైన శైలితో బౌలింగ్‌ చేసిన కుక్‌.. ఊరించే బంతులేసి చివరకు ఇషాంత్‌ను పెవిలియన్‌కు పంపించాడు. అతని బౌలింగ్‌ విధానంతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ నవ్వులు పూయించాడు.

కుక్‌  టెస్టు కెరీర్‌ 
టెస్టులు 160 
ఇన్నింగ్స్‌  289 
పరుగులు 12,254 
అత్యధిక స్కోరు 294 
సగటు 44.88 
శతకాలు 32 
ద్విశతకాలు 5
అర్ధసెంచరీలు 56 
క్యాచ్‌లు  173  

మరిన్ని వార్తలు