ఖాళీ స్టేడియాల్లో ప్రపంచకప్‌ నిర్వహిస్తారా?

15 Apr, 2020 04:36 IST|Sakshi

ఆ స్థితిని ఊహించలేనన్న అలెన్‌ బోర్డర్‌

మెల్‌బోర్న్‌ : స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా టి20 ప్రపంచకప్‌ను నిర్వహించవచ్చంటూ వస్తున్న కొన్ని ప్రతిపాదనలపై ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్‌ బోర్డర్‌ విస్మయం వ్యక్తం చేశాడు. కోవిడ్‌–19 కారణంగా టోర్నీ నిర్వహణ సమస్యగా మారడంతో టీవీ ప్రేక్షకుల కోసమే మ్యాచ్‌లు జరపాలంటూ కొందరు చేసిన సూచనలపై అతను తీవ్రంగా స్పందించాడు. ‘ఖాళీ స్టేడియాల్లో ప్రపంచ కప్‌ ఆడటాన్ని నేను అసలు ఊహించలేను. అసలు ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, టోర్నీతో సంబంధం ఉన్నవారంతా దేశం మొత్తం తిరుగుతూ ఆడవచ్చు. కానీ అభిమానులకు మాత్రం అనుమతి ఉండదా. నాకు తెలిసి ఇది జరిగే అవకాశం లేదు.

కరోనా బాధ తగ్గి అంతా సాధారణంగా మారిన తర్వాత దీనిని నిర్వహించండి లేదా దీనిని ప్రస్తుతానికి రద్దు చేసి అవకాశం ఉన్న మరో తేదీల్లో సర్దుబాటు చేయండి’ అని బోర్డర్‌ సూచించాడు. విధ్వంసక ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రేక్షకులే రానప్పుడు వరల్డ్‌ కప్‌ జరుగుతోందని చెబితే ఎవరూ నమ్మరని, తనకు తెలిసి ఇది సాధ్యమయ్యే పని కాదని అతను అన్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు సుమారు 6,400 మంది కరోనా బారిన పడగా, 61 మంది చనిపోయారు.  

మరిన్ని వార్తలు