పాక్‌పై టీమిండియా సర్జికల్‌ స్ట్రైక్‌ ఇది : అమిత్‌షా

17 Jun, 2019 10:46 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆటగాళ్లు మారినా, మైదానాలు మారినా విశ్వ వేదికపై తమను ఓడించే సత్తా పాకిస్తాన్‌కు లేదని భారత్‌ ఆటగాళ్లు మరోసారి నిరూపించారు. ఆదివారం మాంచెస్టర్‌ వేదికగా జరిగిన బిగ్‌ఫైట్‌లో భారత్‌ 89 పరుగుల (డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం) తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌కు ముందు ఎన్ని అంచనాలు ఉన్నా, ‘మ్యాచ్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అంటూ ఇరు దేశాల్లో హడావిడి చేసినా అసలు పోరుకు వచ్చే సరికి భారత్‌ బలం ముందు పాక్‌ ఏమాత్రం నిలబడలేదని ఈ మ్యాచ్‌ కూడా నిరూపించింది. అయితే కోహ్లిసేన సాధించిన ఈ అద్భుత విజయంపై యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా.. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కోహ్లిసేన భారీ విజయాన్ని కొనియాడుతున్నారు.

సోషల్‌ మీడియా వేదికగా ఆటగాళ్ల పోరాటాన్ని ప్రశంసిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అయితే పాకిస్తాన్‌పై భారత్‌ జరిపిన మరో సర్జికల్‌ స్ట్రైక్‌గా ఈ విజయాన్ని అభివర్ణించారు. భారత ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. ఇక అమిత్‌ షాతో పాటు కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, కిరణ్‌ రిజిజు, పియూష్‌ గోయల్‌, మాజీ కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్‌, రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌, రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, ఉపముఖ్యమంత్రి సచిన్‌పైలట్‌, మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌లు భారత విజయాన్ని కొనియాడారు. ఈ గెలుపుతో ప్రతీ భారతీయుడు గర్వపడుతున్నాడని పేర్కొన్నారు.

‘పాకిస్తాన్‌పై టీమిండియా జరిపిన మరో స్ట్రైక్‌. ఫలితం మాత్రమే ఒకటే. అద్భుత ప్రదర్శన కనబర్చిన జట్టుకు అభినందనలు. ఈ అద్భుత విజయం పట్ల ప్రతీ భారతీయుడు గర్వపడుతున్నాడు. సంబరాలు చేసుకుంటూ ఈ గెలుపు ఆస్వాదిస్తున్నాడు.’ - అమిత్‌ షా, కేంద్ర హోంశాఖ మంత్రి

‘పాకిస్తాన్‌పై విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. భారత జట్టు చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శనను కనబర్చింది’- రాజ్‌నాథ్‌ సింగ్‌, భారత రక్షణ శాఖ మంత్రి

‘టీమిండియా బాగా ఆడింది. అద్భుతం విజయాన్నందించినందుకు అభినందనలు. జైహింద్‌’ - నితిన్‌ గడ్కరీ, కేంద్ర రవాణాశాఖ మంత్రి

‘నేనప్పుడే చెప్పా భారత్‌ విజయం సాధిస్తుందని, పాక్‌ ఓడిపోతుందని, వెల్‌డన్‌ బాయ్స్‌. అభినందనలు’- కిరణ్‌ రిజీజు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి

‘ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై మరో అద్భుత విజయాన్నందుకున్న భారత జట్టుకు అభినందనలు. ప్రపంచకప్‌ గెలిచేలా కోహ్లిసేనకు అన్ని కలిసిరావాలని కోరుకుంటున్నాను’- పీయూష్‌ గోయల్‌, కేంద్ర రైల్వేమంత్రి  

‘అద్భుత విజయం సాధించిన భారత్‌కు అభినందనలు’-సుష్మా స్వరాజ్‌, మాజీ విదేశాంగశాఖ మంత్రి

‘అరే ఏం ఆట.. ఈ రోజు పాక్‌పై భారత్‌ ఆటగాళ్లది. నిజంగా అద్భుతం. విశ్వ వేదికపై భారత్‌ను ఓడించే సత్తా పాక్‌కు లేదని మరోసారి నిరూపించారు. రోహిత్‌, కోహ్లిల అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు తమ ప్రదర్శనతో బౌలింగ్‌ విభాగం మెరిసింది. ఇది ఇలానే కొనసాగించండి’- రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌, మాజీ క్రీడాశాఖ మంత్రి

‘పాకిస్తాన్‌పై సాటిలేని విజయాన్నిసొంతం చేసుకున్న భారత జట్టుకు అభినందనలు. దేశం గర్వించేలా మీ ప్రదర్శన కొనసాగుతూనే ఉండాలి. ధన్యవాదాలు’- కాంగ్రెస్‌ పార్టీ

‘పాకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు. ఈ విజయంలో భారత ప్రజలు గర్వించేలా చేశారు’.- అశోక్‌ గెహ్లాట్‌,  రాజస్తాన్‌ ముఖ్యమంత్రి

‘పాక్‌పై అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న భారత జట్టుకు అభినందనలు. ఇదే ఊపుతో ప్రపంచకప్‌ను సాధిస్తారని మేం ఆశిస్తున్నాం. భారత జట్టు అభిమానిగా గర్వపడుతున్నాం.’- సచిన్‌ పైలట్‌, రాజస్తాన్‌ ఉపముఖ్యమంత్రి

‘పరుగులు, వర్షం, మొత్తానికి మనదే 7-0 ఆధిపత్యం. జై హింద్‌’- గౌతం గంభీర్‌, బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్‌

మరిన్ని వార్తలు