ఆ అకౌంట్లపై చర్యలు తీసుకోండి: సచిన్‌

28 Nov, 2019 10:15 IST|Sakshi

ముంబై: తన కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌, కూతురు సారా టెండూల్కర్‌ పేరు మీద ఉన్న ట్వీటర్‌ అకౌంట్లు ఫేక్‌ అని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ స్పష్టం చేశాడు. వాటిపై చర్యలు తీసుకోవాలని మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్వీటర్‌ను కోరాడు. జూనియర్‌ టెండూల్కర్‌ పేర మీద ఉన్న ట్వీటర్‌ అకౌంట్‌ తన కుమారుడు అర్జున్‌ది కాదని పేర్కొన్నాడు. అలాగే తన కుమారుడు అర్జున్‌కు కానీ, కూతురు సారాకు కానీ ట్వీటర్‌ అకౌంట్ల లేవనే ఈ విషయాన్ని సచిన్‌ తెలియజేశాడు. జూనియర్‌ టెండూల్కర్‌ పేరుతో కొంతమంది ప్రముఖలపై వ్యతిరేకంగా ట్వీట్లు వస్తున్న నేపథ్యంలో సచిన్‌ స్పందించాడు.

‘ఆ అకౌంట్‌ అర్జున్‌ టెండూల్కర్‌ది కాదు. అసలు అర్జున్‌కు ట్వీటర్‌ అకౌంట్‌ లేదు. మా పిల్లలు ఇద్దరికీ ట్వీటర్‌ అకౌంట్లు లేవు. పలువురిపై జూనియర్‌ టెండూల్కర్‌ పేరుతో వస్తున్న ట్వీట్లు మా కుమారుడివి కావు. అది ఫేక్‌ అకౌంట్‌. దానిపై ట్వీటర్‌ ఇండియా  సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి’ అని సచిన్‌ విజ్ఞప్తి చేశాడు. మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు మద్దతు ఇస్తున్నానంటూ జూనియర్‌ టెండూల్కర్‌ పేరుతో ఒక ట్వీట్‌ వెలుగు చూసింది. ‘ ఐయామ్‌ విత్‌ ఫడ్నవీస్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో జూనియర్‌ టెండూల్కర్‌ అకౌంట్‌లో దర్శనమిచ్చింది. ఇది సచిన్‌ కుమారుడు అర్జున్‌ చేసిందంటూ పెద్ద దుమారం లేచింది. దాంతో సచిన్‌ వివరణ ఇచ్చుకుంటూ తన కుమారుడుకు ట్వీటర్‌ అకౌంట్‌ లేదన్నాడు. అలానే కూతురు సారాకు కూడా ఎటువంటి అకౌంట్‌ లేదన్నాడు.

లెఫ్టార్మ్‌ మీడియం పేసరైన అర్జున్‌.. అండర్‌ 16, అండర్‌-19 స్థాయిలో ముంబైకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఏడాది ఆరంభంలో ప్రి సీజన్‌ టోర్నమెంట్‌లో భాగంగా ముంబై సీనియర్‌ జట్టుకు కూడా సెలక్ట్‌ అయ్యాడు. మరొకవైపు అండర్‌-19 భారత జట్టుకు కూడా అర్జున్‌ ఆడాడు. గతేడాది శ్రీలంకతో జరిగిన అండర్‌-19 మ్యాచ్‌లకు భారత్‌ తరఫున అర్జున్‌ ప్రాతినిథ్యం వహించాడు. ఇ​క  భారత్‌-ఇంగ్లండ్‌ సీనియర్‌ జట్లకు నెట్స్‌లో బౌలింగ్‌  వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మరిన్ని వార్తలు