CWC 2023: గెలుపోటములు సహజం.. అదొక్కటే విషాదం! కోహ్లి, రోహిత్‌ను ఓదార్చిన సచిన్‌

20 Nov, 2023 14:02 IST|Sakshi
కోహ్లితో సచిన్‌ టెండుల్కర్‌ (PC: ICC)

ఒక్క అడుగు.. ఇంకొక్క అడుగు అంటూ ఊరించిన విజయం ఈసారి కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీని గెలవాలన్న టీమిండియా కల ఆస్ట్రేలియా కారణంగా చెదిరిపోయింది.

ఐసీసీ టోర్నీల్లో తమకు తామే సాటి అన్న విషయాన్ని మరోసారి నిరూపించిన కంగారు జట్టు రికార్డు స్థాయిలో ఆరోసారి విజేతగా నిలవగా.. మూడోసారి కప్‌ను ముద్దాడాలని భావించిన భారత జట్టుకు నిరాశ ఎదురైంది.

అత్యధిక పరుగుల వీరుడుగా విరాట్‌ కోహ్లి.. అత్యధిక వికెట్లు పడగొట్టిన ధీరుడిగా మహ్మద్‌ షమీ.. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ రాణించిన రోహిత్‌ శర్మ.. మిడిలార్డర్‌లో స్థాయికి తగ్గట్లు ఆడిన శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌.. తమ పని తాము చేసుకుపోతూ విజయాల్లో తమ వంతు పాత్ర పోషించిన బౌలింగ్‌ దళం.. జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌..

చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన సిరాజ్‌
ఒక మ్యాచ్‌లో ఒకరు హీరోగా నిలిస్తే.. మరో మ్యాచ్‌లో ఇంకొకరు.. అంతా కలిసి సమష్టిగా రాణించి లీగ్‌ దశతో పాటు సెమీ ఫైనల్లోనూ జట్టును అజేయంగా నిలిపారు. ఉవ్వెత్తున ఎగిసే కెరటాల్లా టాప్‌గేర్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లారు. కానీ.. తుదిమెట్టుపై ఊహించని ఫలితంతో డీలా పడ్డారు.

ఇప్పుడు కాక.. ఇంకెప్పుడు.. దిగాలుగా రోహిత్‌, కోహ్లి
అహ్మదాబాద్‌లో లక్ష మందికి పైగా అభిమానుల సమక్షంలో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేక సిరాజ్‌ చిన్నపిల్లాడిలా ఏడిస్తే.. రోహిత్‌, కోహ్లి సైతం దిగాలుగా తలలు దించుకున్నారు. 

ఇంతదాకా వచ్చి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు అన్న పరిస్థితిలో దాదాపుగా తమ ఫైనల్‌ వన్డే వరల్డ్‌కప్‌ ఆడిన ఈ దిగ్గజ బ్యాటర్ల మనసులో దాగిన ఆవేదన వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో అశేష అభిమానులతో పాటు భారత మాజీ క్రికెటర్ల హృదయాలు కూడా ముక్కలయ్యాయి.

జట్టును ఓదార్చిన సచిన్‌
అయితే, ఆటలో గెలుపోటములు సహజమంటూ ఫ్యాన్స్‌తో పాటూ వారూ రోహిత్‌ సేనకు అండగా నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ మైదానంలోకి వచ్చి భారత ఆటగాళ్లను ఓదార్చిన దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

తన వన్డే సెంచరీల రికార్డు బ్రేక్‌ చేసిన కోహ్లిని ఆత్మీయంగా హత్తుకున్న సచిన్‌.. మిగతా ఆటగాళ్లతో కరచాలనం చేస్తూ వారిని అనునయించే ప్రయత్నం చేశాడు. ఇక్కడిదాకా సాగిన మీ ప్రయాణం అద్బుతం అంటూ ఓటమి బాధలో కూరుకుపోయిన జట్టును ఓదార్చాడు. నిజమే కదా.. ఆట అన్నాక ఒకరు గెలవడం.. మరొకరు ఓడిపోవడం సహజమే.. అయితే, ఆ ఓడిపోయిన వాళ్లుగా మన జట్టు ఉండటం విషాదం!!

చదవండి: CWC 2023: విరాట్‌ కోహ్లికి మూడు, షమీకి రెండు.. అవార్డుల జాబితా 

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు