Virat Kohli: ఆ విషయంలోనూ తన ఆరాధ్య ఆటగాడి అడుగుజాడల్లోనే..! 

20 Nov, 2023 14:22 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన విరాట్‌ కోహ్లి ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ఎడిషన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 95.62 సగటున 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీల సాయంతో 765 పరుగులు చేశాడు. కోహ్లి వన్డే వరల్డ్‌కప్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు గెలుచుకోవడం ఇదే తొలిసారి. అతను టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం రెండుసార్లు ఈ ఘనతను సాధించాడు. 2014, 2016 ఎడిషన్లలో ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డును గెలుచుకున్నాడు. 

కోహ్లి ఈ ఎడిషన్‌లో ఆటగాడిగా సూపర్‌ సక్సెస్‌ అయినప్పటికీ.. టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టలేకపోయాడు. క్రికెట్‌ గాడ​్‌ సచిన్‌ టెండూల్కర్‌కు సైతం గతంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2003 ఎడిషన్‌లో సచిన్‌ కూడా ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నప్పటికీ టీమిండియాకు టైటిల్‌ను అందించలేకపోయాడు. క్రికెట్‌కు సంబంధించి ప్రతి విషయంలోనూ సచిన్‌ అడుగుజాడల్లో నడిచే కోహ్లి ఈ విషయంలోనూ తన ఆరాధ్య ఆటగాడినే ఫాలో అయ్యాడు. 

ఇదిలా ఉంటే, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసి నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైంది. ఛేదనలో ఆసీస్‌ ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ అనంతరం అద్భుతంగా పుంజుకుని ఆరోసారి వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ట్రవిస్‌ హెడ్‌ (137).. లబూషేన్‌ (58 నాటౌట్‌) సహకారంతో ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.

వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ (47), విరాట్‌ కోహ్లి (54), కేఎల్‌ రాహుల్‌ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్‌ బౌలర్లు స్టార్క్‌ (3/55), హాజిల్‌వుడ్‌ (2/60), కమిన్స్‌ (2/34), మ్యాక్స్‌వెల్‌ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. 

మరిన్ని వార్తలు