ఆసీస్‌దే ట్రై సిరీస్‌

31 Mar, 2018 13:26 IST|Sakshi

ముంబై: మహిళల ముక్కోణపు టీ20 సిరీస్‌ను ఆసీస్‌ కైవసం చేసుకుంది. శనివారం ఇంగ్లండ్‌తో ఇక్కడ బ్రాబోర్న్‌ స్టేడియంలో జరిగిన తుదిపోరులో ఆసీస్‌ 57 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఆసీస్‌ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఇంగ్లండ్‌ క్రీడాకారిణుల్లో నటాలీ స్కీవర్‌(50) హాఫ్‌ సెంచరీతో రాణించగా, డానియెల్లీ వ్యాట్‌(34),  ఎలెన్‌ జోన్స్‌(30)లు మాత్రమే మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. ప్రధానంగా ఏడుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఇంగ్లండ్‌కు ఘోర పరాజయం ఎదురైంది.

అంతకు​ముందు టాస్‌ ఓడి తొలుత  బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ మహిళలు 209 పరుగులు సాధించారు. ఫలితంగా మహిళల అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఆసీస్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా పేరిట ఉన్న 205 పరుగుల రికార్డును ఆసీస్‌ బ్రేక్‌ చేసింది. అలైస్సాహేలీ (33), గార్డనర్‌(33)లు మోస్తరుగా ఆకట్టుకోగా, కెప్టెన్‌ మెగ్‌ లాన్నింగ్‌(88 నాటౌట్‌;45 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్‌), విల్లానీ(51; 30 బంతుల్లో 8 ఫోర్లు) చెలరేగి ఆడారు. దాంతో ఆసీస్‌ రికార్డు స్కోరు సాధించింది.

మరిన్ని వార్తలు