భద్రతా దళాలకు బీసీసీఐ రూ. 20 కోట్లు వితరణ

24 Mar, 2019 01:35 IST|Sakshi

చెన్నై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం దేశ రక్షణ కోసం ప్రాణాలనే పణంగా పెట్టే భద్రతా దళాలకు రూ. 20 కోట్ల విరాళాన్ని అందజేసింది. ఇటీవల పుల్వామాలో ఉగ్రదాడికి 40 మంది భారత సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు బలయ్యారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో బీసీసీఐ, లీగ్‌ పాలక మండలి 12వ ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభోత్సవ వేడుకల్ని రద్దు చేసింది. ఆ వేడుకలకు వెచ్చించే మొత్తానికి మరికొంత జతచేసి సాయుధ బలగాలకు ఇవ్వాలని బీసీసీఐ గతంలోనే నిర్ణయించింది. అనుకున్నట్లే శనివారం రూ. 11 కోట్లను భారత ఆర్మీకి, రూ. 7 కోట్లను సీఆర్‌పీఎఫ్‌కు, రూ. కోటి చొప్పున నావిక దళం, వాయు సేనలకు అందజేశామని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘వేడుకల్ని రద్దు చేసి ఆ మొత్తాన్ని అమర జవాన్లకు విరాళమివ్వాలని బీసీసీఐ, పరిపాలక కమిటీ (సీఓఏ) ఏకగ్రీవంగా తీర్మానించాయి’ అని సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ అన్నారు. ఇది స్వాగతించాల్సిన విషయమని బోర్డు ఇకముందు కూడా జాతి అభీష్టం మేరకు నడుచుకుంటుందని సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ అన్నారు. 

సీఎస్‌కే తరఫున రూ. 2 కోట్లు... 
భారత క్రికెటర్లు ఇప్పటికే ఒక మ్యాచ్‌ ఫీజు మొత్తాన్ని పుల్వామాలో అమరులైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు అందజేశారు. ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) కూడా అలాంటి పనే చేసింది. తమ సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన రూ. 2 కోట్లను జవాన్ల కుటుంబాలకు అందజేసింది.    

>
మరిన్ని వార్తలు