న్యాయపోరాటానికి దిగిన బెన్‌ స్టోక్స్‌

11 Oct, 2019 13:35 IST|Sakshi

లండన్‌: తమ గోప్యతకు భంగం కలిగించే అత్యంత సున్నితమైన విషయాలను ప్రచురించిన ‘ది సన్‌’ పత్రికపై ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌​ స్టోక్స్‌ న్యాయపోరాటానికి దిగాడు. ఈ విషయంపై స్టోక్స్‌ తన తల్లితో పాటు స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ ఆమోదం లేకుండా తమ కుటుంబానికి సంబంధించి అత్యంత బాధకరమైన, సున్నితమైన వ్యక్తిగత విషయాలను ప్రచురించినందుకు గాను చర్యలు తీసుకోవాలని వారు కోర్టుకు విన్నవించుకున్నారు.  

అసలేం జరిగిందంటే..
‘స్టోక్స్‌ సీక్రెట్‌ ట్రాజెడీ’ అనే పేరుతో సన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. స్టోక్స్‌ అక్క, అన్నను అతడి తల్లి మాజీ ప్రియుడు చంపేశాడు. స్టోక్స్‌ పుట్టడానికి మూడేళ్ల ముందు ఇది జరిగిందని సదరు పత్రిక కధనాన్ని ప్రచురించింది. దీనిపై స్టోక్స్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత విషయాలు అది కూడా తాను పుట్టాక మునుపు జరిగిన విషయాలను ఇప్పుడు ప్రచురించడం ఎంతవరకు సబబు అని ?  జర్నలిజం పేరుతో దిగజారతారా? అని ఆయన ప్రశ్నించిన విషయం తెలిసిందే.

భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని..
తాజాగా  ప్రొఫెషనల్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ (పీసీఏ) అవార్డుల కార్యక్రమం ముగిశాక ఇంటికి వెళ్లే సమయంలో స్టోక్స్‌ తన భార్యతో గొడవపెట్టుకున్నాడని ఓ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా స్టోక్స్‌ భార్య క్లారే అతడి చెంపపై కొట్టినట్టు ఓ ఫోటోను కూడా ప్రచురించింది. దీనిపై స్టోక్స్‌ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ ఫోటోలో క్లారే బెన్‌ స్టోక్స్‌ను కొట్టనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆ సదరు మీడియా మాత్రం స్టోక్స్‌ను క్లారే కొట్టినట్లు ప్రచురించింది. 

ప్రపంచకప్‌కు ఇంగ్లండ్‌కు అందించి సంబరాలు చేసుకుంటున్న తరుణంలో మీడియాలో ఇలా తనకు వ్యతిరేకంగా వరుస కథనాలు రావడం పట్ల స్టోక్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. అయితే అతడికి ఇంగ్లండ్‌ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. స్టోక్స్‌కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న పత్రికలపై వారు కూడా విమర్శిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు