భారత దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారానికి నామినేట్‌ అయిన షమీ..?

13 Dec, 2023 18:36 IST|Sakshi

టీమిండియా పేస్‌ సెన్సేషన్‌, వన్డే వరల్డ్‌కప్‌ 2023 హీరో మొహమ్మద్‌ షమీ భారత దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డుకు నామినేట్‌ అయినట్లు తెలుస్తుంది. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) షమీ పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసినట్లు సమాచారం.

షమీ అర్జున అవార్డుకు పూర్తి స్థాయి అర్హుడని బీసీసీఐ కేంద్రానికి సమర్పించిన ప్రత్యేక అభ్యర్ధనలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. 2021లో టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధవన్‌ అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు. ప్రస్తుత భారత జట్టులోని సభ్యులు విరాట్‌ కోహ్లి (2013), రోహిత్‌ శర్మ (2015), రవిచంద్రన్‌ అశ్విన్‌ (2014), రవీంద్ర జడేజా (2019) అర్జున అవార్డు గెలుచుకున్న వారిలో ఉన్నారు.

33 ఏళ్ల షమీ ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో లీడింగ్‌ వికెట్‌టేకర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భారత్‌.. చివరివరకు అజేయ జట్టుగా నిలిచి, తుది సమరంలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో భారత విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించిన షమీ.. 7 మ్యాచ్‌ల్లో 3 ఐదు వికెట్ల ఘనతలతో 24 వికెట్లు పడగొట్టాడు. త్వరలో సౌతాఫ్రికాతో జరుగనున్న టెస్ట్‌ సిరీస్‌ కోసం షమీ ప్రిపేర్‌ అవుతున్నాడు. 
 

>
మరిన్ని వార్తలు