కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో బుమ్రా

28 Aug, 2019 06:13 IST|Sakshi

ఏడో స్థానానికి ఎగబాకిన భారత పేసర్‌

దుబాయ్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అత్యద్భుత బౌలింగ్‌ ప్రదర్శన చేసిన భారత పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా తొమ్మిది స్థానాలు పురోగతి సాధించి తొలిసారి టాప్‌–10లోకి దూసుకొచ్చాడు. 774 రేటింగ్‌ పాయింట్లతో బుమ్రా ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. ఇప్పటివరకు బుమ్రా అత్యుత్తమ ర్యాంక్‌ 15గా ఉండేది. 908 రేటింగ్‌ పాయింట్లతో కమిన్స్‌ (ఆస్ట్రేలియా), రబడ (దక్షిణాఫ్రికా–851 పాయింట్లు), అండర్సన్‌ (ఇంగ్లండ్‌–814 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్‌కే చెందిన రవీంద్ర జడేజా పదో స్థానంలో నిలిచాడు. 

కోహ్లి ‘టాప్‌’లోనే... 
టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 910 ర్యాంకింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. యాషెస్‌ సిరీస్‌లోని మూడో టెస్టుకు దూరంగా ఉన్న ఆసీస్‌ స్టార్‌ ప్లేయర్‌ స్టీవ్‌ స్మిత్‌ 904 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. కేన్‌ విలియమ్సన్‌ (న్యూజిలాండ్‌) మూడో ర్యాంక్‌లో, చతేశ్వర్‌ పుజారా (భారత్‌) నాలుగో ర్యాంక్‌లో ఉన్నారు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేసిన అజింక్య రహానే 10 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరాడు. అజేయ సెంచరీతో యాషెస్‌ మూడో టెస్టులో ఇంగ్లండ్‌ను గెలిపించిన బెన్‌ స్టోక్స్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌ను అందుకున్నాడు.   

మరిన్ని వార్తలు