వరద ప్రాంతాలకు ఉచితంగా విత్తనాలు

28 Aug, 2019 05:16 IST|Sakshi

ప్రస్తుతం ఇస్తున్న పరిహారం 15 శాతం పెంపు

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

వరదల్లో ఆహార పంటల ఆర్థిక నష్టం రూ.95.23 కోట్లు

కావాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.37.68 కోట్లు

ఉత్పత్తి నష్టం 71,253 మెట్రిక్‌ టన్నులు

సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి సహా వివిధ నదులకు వచ్చిన వరదలతో పంట దెబ్బతిన్న ప్రాంతాలకు పూర్తి సబ్సిడీపై ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేయనుంది. వరదలతో మొత్తం పది జిల్లాలకు నష్టం జరిగినప్పటికీ నాలుగు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 90 మండలాలు, 484 గ్రామాలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ లెక్క తేల్చింది. 1,777 హెక్టార్లలో నారుమళ్లు, 22,022 హెక్టార్లలో వరినాట్లు, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. 13,574 మంది రైతులు నష్టపోయారు. సుమారు 71,253 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తికి నష్టం జరిగినట్టు తేలింది. ఫలితంగా రూ.95.23 కోట్ల ఆర్థిక నష్టం జరిగినట్టు అంచనా. వరద తాకిడికి గురైన ప్రాంతాలకు పూర్తి సబ్సిడీపై వరి, మినుము, పెసర, మొక్కజొన్న విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేయనుంది. ప్రస్తుతం వివిధ పంటలకు ఇస్తున్న పరిహారాన్ని 15 శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

ఉద్యాన పంటలకు నష్టం: రూ.228 కోట్లు
ఉద్యాన పంటలకు ఈ వరదల్లో భారీగా నష్టం వాటిల్లింది. కృష్ణా నది వరదలతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కంద, పసుపు, అరటి, చేమ, తమలపాకు తోటలతో పాటు పలు కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటి నష్టం రూ.228 కోట్లకు పైగా ఉండవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు మండలాలు కూడా ముంపునకు గురయ్యాయి.  

మరిన్ని వార్తలు