‘సెరెనాపై కార్టూన్‌లో తప్పు లేదు’

26 Feb, 2019 01:07 IST|Sakshi

సిడ్నీ: అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ ప్రవర్తనను ఉద్దేశిస్తూ గతేడాది సెప్టెంబరులో ‘హెరాల్డ్‌ సన్‌’ పత్రికలో ప్రచురితమైన కార్టూన్‌లో ఎలాంటి తప్పు లేదని ఆస్ట్రేలియా ప్రెస్‌ కౌన్సిల్‌ తేల్చింది. నిరుడు యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి నయోమి ఒసాకా చేతిలో ఓటమిని జీర్ణించుకోలేని సెరెనా... కోర్టులోనే ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. అంపైర్‌ను ‘దొంగ... అబద్ధాలకోరు’ అంటూ తీవ్రంగా దూషించింది.

దీనిపై నల్లటి దుస్తుల్లో ఉన్న సెరెనాను కొంచెం లావుగా చూపిస్తూ, రాకెట్‌ విరగ్గొట్టి కోర్టులో ఆమె గంతులేస్తున్నట్లు, ‘నువ్వు ఆమెను గెలవనివ్వాల్సింది’ అని ఒసాకాకు అంపైర్‌ చెబుతున్నట్లు ‘హెరాల్డ్‌ సన్‌’ కార్టూనిస్ట్‌ మార్క్‌ నైట్‌ కార్టూన్‌ వేశాడు.  సెరెనా చిత్రణను ఆక్షేపిస్తూ ఇది కాస్తా జాతి వివక్ష, లింగ వివక్ష కోణంలో వివాదాస్పదమైంది. అప్పటికీ తప్పేమీ లేదని బలంగా చెబుతూ పత్రిక మరోసారి కార్టూన్‌ను ప్రచురించింది. చివరకు విషయం ఆస్ట్రేలియా ప్రెస్‌ కౌన్సిల్‌ వద్దకు చేరింది. విచారణ జరిపిన కౌన్సిల్‌... మ్యాచ్‌ రోజు సెరెనా చిన్న పిల్లలా ప్రవర్తించిందనే ఉద్దేశంలోనే కార్టూన్‌ ఉందని స్పష్టం చేసింది.    

మరిన్ని వార్తలు