అభిమానుల అతి.. చిక్కుల్లో రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌

30 Dec, 2017 11:45 IST|Sakshi

న్యూఢిల్లీ : అభిమానులు అతిగా ప్రవర్తించడంతో రెండుసార్లు ఒలింపిక్‌ విజేతైన రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ చిక్కుల్లో పడ్డారు. సుశీల్‌ అనుచరులు తమపై దాడి చేశారని ప్రత్యర్థీ రెజ్లర్‌ ప్రవీణ్‌ రాణా సోదరుడు.. నవీన్‌రాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం ఢిల్లీ పోలీసులు సుశీల్‌పై కేసు నమోదు చేశారు. వచ్చే ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్ల ఎంపిక కోసం శుక్రవారం  సెలక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. ఈ  సందర్భంగా ఇద్దరి రెజ్లర్ల అనుచరుల మధ్య రచ్చ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.  

ఇందులో 74 కేజీల విభాగంలో తన ఆటను ప్రదర్శించేందుకు సుశీల్‌ కుమార్‌ బరిలోకి దిగాడు. సెమీస్‌లో అతనికి ప్రత్యర్థిగా ప్రవీణ్‌ రాణా నిలిచాడు. ఈ బౌట్‌లో సుశీల్‌ సునాయాసంగానే నెగ్గాడు. ఆ తర్వాత ఫైనల్‌ కూడా గెలిచి కామన్వెల్త్‌ గేమ్స్‌కు అర్హత సాధించాడు. అయితే సెమీస్‌ పోరు తర్వాత ప్రవీణ్‌ సుశీల్‌ అనచురులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ‘సుశీల్‌కు ప్రత్యర్థిగా నిలబడేంత సాహసం చేస్తావా’ అంటూ సుశీల్‌ అనుచరులు తనను, తన సోదరుడిని కొట్టారని అతను చెప్పాడు.

తనను చంపేస్తామని కూడా వారు బెదిరించారని, ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌లో ఎలా పాల్గొంటావో చూస్తామంటూ హెచ్చరించారని కూడా ప్రవీణ్‌ ఆరోపించాడు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందినవారు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.  ఈ ఘటనను సుశీల్‌ ఖండించాడు. ‘బౌట్‌లో ప్రవీణ్‌ నన్ను కొరికాడు కూడా. అయితే అది అతని వ్యూహంలో భాగం కావచ్చు కాబట్టి పట్టించుకోను. అయితే బయట జరిగిన ఘటన సరైంది కాదు. నేను దానిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక్కసారి బౌట్‌ ముగిసిందంటే మేం ఒకరినొకరం గౌరవించుకుంటాం’ అని సుశీల్‌ ట్విట్టర్‌ వేదికగా వివరణ ఇచ్చాడు. 

కేసుపై స్పందించిన సుశీల్‌ కుమార్‌..
‘ఇలాంటి ఘటనలు క్రీడల్లో చోటుచేసుకోకూడదు. ఓటమి, గెలుపు మంచిగానే తీసుకోవాలి. ఆ విషయంలో ప్రవీణ్‌ జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. అక్కడ క్రమశిక్షణతో నడుచుకోవాల్సింది, ఏ ఒక్కరు రఫ్‌గా ఆడలేదు. మనం దేశం తరుపున రెజ్లింగ్‌ ఆడుతున్నామని’  కేసునమోదవ్వడంపై సుశీల్‌  స్పందించాడు.

మరిన్ని వార్తలు