CWC 2023 Final: ఆకాశనంటుతున్న ధరలు.. హోటల్‌ గదికే రూ. 2 లక్షలు!

18 Nov, 2023 08:33 IST|Sakshi

క్రికెట్‌ ‍ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్‌ జరుగనుంది. తుదిపోరులో పటిష్ట టీమిండియా- మేటి జట్టు ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని  నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇరవై ఏళ్ల తర్వాత టీమిండియా- ఆసీస్‌లు మరోసారి ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడటం మరో విశేషం.

ఈ నేపథ్యంలో దారులన్నీ అహ్మదాబాద్‌ వైపే సాగుతున్నాయి. దీంతో వ్యాపార వర్గాలు వరల్డ్‌కప్‌ ఫీవర్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డాయి. విమాన టిక్కెట్ల ధరలతో పాటు హోటల్‌ గదుల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణంగా అహ్మదాబాద్‌లో సాదాసీదా డార్మెటరీ, మోస్తరు గదులున్న హోటళ్లలో రేట్లు కేవలం రూ.1000, మహా అయితే రూ. 3000 ఉండేవి. కానీ... క్రికెట్‌ అభిమానుల తాకిడి నేపథ్యంలో ఈ రేట్లు అమాంతం రూ. 20 వేలు, నుంచి 50 వేలకు పెరిగిపోయాయి. ఏసీ, లగ్జరీ సదుపాయాలంటే ఆ రేటు ఇక చెప్పాల్సిన పనేలేదు. లక్షకు అటు ఇటుగానే ఉండనుంది.

అలాగే అత్యంత పరిమితంగా 5000 అటు ఇటుగా ఉన్న త్రీస్టార్, ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో బస చేయాలంటే రూ. 2 లక్షలదాకా వెచ్చిం చాల్సిందే. నిజం చెప్పాలంటే ఫైనల్‌ జరుగుతుంది ముంబైలో కాదు... అహ్మదాబాద్‌లో కాబట్టి చిన్నా, చితక హోటళ్లు, డార్మెటరీ బెడ్లు అన్నీ కలుపుకున్నా 10 వేలకు మించవు. కాబట్టే రేట్లు రాకెట్లలా  దూసుకెళ్తున్నాయి.  అదీ సంగతి.. మరి క్రికెట్‌ వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ను నేరుగా వీక్షించాలంటే జేబుకు ఆ మాత్రం చిల్లుపడాల్సిందే అంటారా?!

ఈ విషయం గురించి గుజరాత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ హోటల్‌, రెస్టారెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరేంద్ర సోమాని పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్‌ ఫీవర్‌ కేవలం ఇండియాకే పరిమితం కాదు కదా! దుబాయ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి విదేశాల నుంచి కూడా అభిమానులు ఇక్కడికి వస్తున్నారు. 

అహ్మదాబాద్‌లో త్రీ స్టార్‌, ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లో కలిపి దాదాపు 5 వేల గదులు అందుబాటులో ఉన్నాయి. చిన్నాచితకా హోటళ్లన్నీ కలుపుకొని మొత్తం 10 వేల వరకు ఉంటాయి. మరి నరేంద్ర మోదీ స్టేడియంలో సీట్ల సామర్థ్యమేమో లక్షా ఇరవై వేల వరకు ఉంటుంది. కాబట్టే పరిస్థితి ఇలా ఉంది’’ అని పేర్కొన్నారు.
 

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు