ప్రపంచ కప్‌ సన్నాహాలకు ఐపీఎల్‌ తోడ్పడుతుంది

2 Mar, 2019 01:23 IST|Sakshi

చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌

న్యూఢిల్లీ: ప్రపంచ కప్‌ ముంగిట ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఆడటం మన క్రికెటర్లకు మేలు చేస్తుందని భారత చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. ప్రతిష్ఠాత్మక టోర్నీకి ముందు లీగ్‌ ఆడటం ఓ రకంగా మంచి సన్నాహకమేనని ఆయన అన్నారు. శుక్రవారం ఇక్కడ ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న ఎమ్మెస్కే ఈ వ్యాఖ్యలు చేశారు. భిన్నమైన ఒత్తిడిలో ఆటగాళ్లు రాటుదేలేలా చేసే ఐపీఎల్‌ను ‘భారత అంతర్జాతీయ టోర్నీ’గా ఆయన అభివర్ణించారు. ‘లీగ్‌పై నా దృష్టి కోణం భిన్నమైనది. ప్రత్యేక శిక్షణ ద్వారానో, నెట్స్‌లో ప్రాక్టీస్‌ సెషన్ల ద్వారానో కంటే, పోటీ వాతావరణాన్ని కల్పించే ఐపీఎల్‌ ఆడటం ఎక్కువ ప్రయోజనకరం.

ఉదాహరణకు ఇంగ్లండ్‌లోనే జరిగిన 2013, 2017 చాంపియన్స్‌ ట్రోఫీలనే తీసుకోండి. ఆ సంవత్సరాల్లో భారత క్రికెటర్లు ఐపీఎల్‌ ఆడి చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొన్నారు. ఈ రెండుసార్లూ మనం ఫైనల్‌ చేరాం’ అని ఎమ్మెస్కే వివరించారు. నాలుగు ఓవర్ల కోటానే ఉంటుంది కాబట్టి ఐపీఎల్‌ కారణంగా భారత బౌలర్లపై భారం పడదన్నారు. చక్కటి పోటీ వాతావరణంలో జరిగే లీగ్‌లో ఆడిన అనుభూతి... సాధారణ ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొంటే రాదని, కాకపోతే వారు ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకుంటారనేదే కీలకమని ఎమ్మెస్కే అన్నారు.    
 

మరిన్ని వార్తలు