లిన్‌... గెలిపించెన్‌

30 Apr, 2018 04:08 IST|Sakshi

6 వికెట్లతో కోల్‌కతా విజయం

రాణించిన ఉతప్ప, కార్తీక్, రసెల్‌

బెంగళూరుకు మరో ఓటమి

విరాట్‌ కోహ్లి శ్రమ వృథా  

బెంగళూరు: ఈ సీజన్‌లో పడుతూ లేస్తూ సాగుతున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు మరో ఓటమి. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 200లకు పైగా పరుగులు చేసి కూడా పరాజయం పాలైన ఆ జట్టు ఈ మ్యాచ్‌లో 175 పరుగులనూ కాపాడుకోలేకపోయింది. ఫలితంగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓటమిని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

విరాట్‌ కోహ్లి (44 బంతుల్లో 68 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా... మెకల్లమ్‌ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. రసెల్‌ (3/31)కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బరిలో దిగిన కోల్‌కతా 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 176 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్రిస్‌ లిన్‌ (52 బంతుల్లో 62 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌), ఉతప్ప (21 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కార్తీక్‌ (10 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. సిరాజ్, మురుగన్‌ అశ్విన్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు.   

లిన్‌ మెరుపులు...
రెండు వరుస ఓటములతో డీలా పడ్డ కోల్‌కతాకు ఈ మ్యాచ్‌లో అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు క్రిస్‌ లిన్, నరైన్‌ (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగడంతో పవర్‌ప్లేలో 51 పరుగులు వచ్చాయి. లిన్‌ 7 పరుగుల వద్ద ఉన్నపుడు అతను ఇచ్చిన క్యాచ్‌ను మురుగన్‌ అశ్విన్‌ వదిలేశాడు. తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించాక నరైన్‌ ఔటైనా లిన్‌... ఉతప్పతో కలిసి ఇన్నింగ్స్‌ ముందుకు నడిపించాడు. ఈ జోడీ బౌండరీలతో విరుచుకుపడటంతో 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 88/1తో నిలిచింది. మరో ఇరవై పరుగులు జోడించాక మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఉతప్ప వెనుదిరిగాడు.

ఈ క్రమంలో లిన్‌ 42 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 17వ ఓవర్లో రాణా (15) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగ్గా... క్రీజులోకి వచ్చిన రసెల్‌ (0) తొలి బంతికే ఔటవ్వడంతో బెంగళూరు శిబిరంలో ఆశలు చిగురించాయి. ఈ సమయంలో విజయానికి 3 ఓవర్లలో 29 పరుగులు అవసరం కాగా... లిన్‌తో కలిసి కార్తీక్‌ చెలరేగాడు. సౌతీ వేసిన 18వ ఓవర్లో 14 పరుగులు, ఆ తర్వాత సిరాజ్‌ ఓవర్లో 11 పరుగులు రావడంతో విజయ సమీకరణం ఆరు బంతుల్లో 4కు చేరింది. చివరి ఓవర్‌ తొలి బంతిని శుబ్‌మన్‌ గిల్‌ (5 నాటౌట్‌) బౌండరీకి తరలించి లాంఛనాన్ని పూర్తి చేశాడు.

స్కోరు వివరాలు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) శుబ్‌మన్‌ (బి) కుల్దీప్‌ 29; మెకల్లమ్‌ (సి) కార్తీక్‌ (బి) రసెల్‌ 38; కోహ్లి నాటౌట్‌ 68; వోహ్రా (బి) రసెల్‌ 0; మన్‌దీప్‌ సింగ్‌ (సి) శివమ్‌ (బి) రసెల్‌ 19; గ్రాండ్‌హోమ్‌ నాటౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 175.

వికెట్ల పతనం: 1–67, 2–74, 3–75, 4–140.  

బౌలింగ్‌: చావ్లా 3–0–22–0, నరైన్‌ 4–0–38–0, జాన్సన్‌ 3–0–38–0, శివమ్‌ 3–0–21–0, కుల్దీప్‌ 4–0–20–1, రసెల్‌ 3–0–31–3.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: లిన్‌ నాటౌట్‌ 62; నరైన్‌ (సి) గ్రాండ్‌హోమ్‌ (బి) మురుగన్‌ అశ్విన్‌ 27; రాబిన్‌ ఉతప్ప (సి) సౌతీ (బి) అశ్విన్‌ 36; రాణా రిటైర్డ్‌ హర్ట్‌ 15; రసెల్‌ (సి) డికాక్‌ (బి) సిరాజ్‌ 0; కార్తీక్‌ (సి) కోహ్లి (బి) సిరాజ్‌ 23; శుబ్‌మన్‌ గిల్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 176.  

వికెట్ల పతనం: 1–59, 2–108, 3–139, 4–171.

బౌలింగ్‌: సౌతీ 4–0–34–0, ఉమేశ్‌ యాదవ్‌ 3.1–0–36–0, యజువేంద్ర చహల్‌ 4–0–29–0, మొహమ్మద్‌ సిరాజ్‌ 4–0–40–2, మురుగన్‌ అశ్విన్‌ 4–0–36–2.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు