రవిశాస్త్రి వద్దు.. ద్రవిడ్‌ ముద్దు!

15 Aug, 2018 11:07 IST|Sakshi
‍రాహుల్‌ ద్రవిడ్‌, రవిశాస్త్రి (ఫైల్‌ ఫొటో)

హెడ్‌ కోచ్‌పై నెటిజన్ల ఫైర్‌

లండన్‌ : ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియా వైఫల్యంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండో టెస్టులో కనీస పోరాటపటిమ కనబర్చకుండా ఓడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరాజయాలకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రిల అనాలోచిత నిర్ణయాలే కారణమని మండిపడుతున్నారు. కోహ్లి బ్యాటింగ్‌లో రాణిస్తున్నా.. కెప్టెన్‌గా దారుణంగా వైఫల్యం చెందడానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే వెంటనే హెడ్‌ కోచ్‌ పదవి నుంచి రవిశాస్త్రిని తొలిగించాలని బీసీసీఐ డిమాండ్‌ చేస్తున్నారు. ఆ స్థానాన్ని టీమిండియా వాల్‌, అండర్‌ 19 కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో భర్తీ చేయాలని సూచిస్తున్నారు. కనీసం బ్యాటింగ్‌ కోచ్‌గానైనా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే దారుణంగా విఫలమైన ఆటగాళ్లను కూడా జట్టు నుంచి తొలిగించాని కోరుతున్నారు. 

భారత్‌ విజయాలు సాధించాలంటే..‘చెంచా రవిశాస్త్రిని వెంటనే తొలిగించి ద్రవిడ్‌ను తీసుకోవాలి. ఫిట్‌నెస్‌ ఒక్కటే మ్యాచ్‌లను గెలిపించదు. ప్రాక్టీస్‌ కూడా అవసరమే. ఆటగాళ్లను ఎక్కువ సంఖ్యలో వార్మప్‌ మ్యాచ్‌లు, దేశావాళీ మ్యాచ్‌లు ఆడించాలి. ధావన్‌, విజయ్‌, రహానేల కెరీర్‌ ముగిసింది. భవిష్యత్తు తారలు రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కరుణ్‌ నాయర్‌లకు అవకాశం కల్పించాలి’ అని ఓ అభిమాని అభిప్రాయపడ్డాడు. ద్రవిడ్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా.. జహీర్‌ ఖాన్‌ బౌలింగ్‌ కోచ్‌ తీసుకోవాలని మరో అభిమాని అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రికి ఉద్వాసన పలికే సమయమిదేనని, అతనికి ఆటపట్ల ఎలాంటి స్ట్రాటజీ లేదని మరొకరు ఘాటుగా కామెంట్‌ చేశారు.

అద్భుత రికార్డు..
ఇంగ్లండ్‌ గడ్డపై ద్రవిడ్‌కు అద్భుత రికార్డు ఉంది. కపిల్‌దేవ్‌ (1986), అజిత్‌ వాడేకర్‌(1971)ల తర్వాత 2007లో ఇంగ్లండ్ గడ్డపై భారత్‌ ద్రవిడ్‌ సారథ్యంలోనే టెస్ట్‌ సిరీస్‌ నెగ్గింది. ఇక బ్యాటింగ్‌లో సైతం ఆ అండర్‌ 19 కోచ్‌కు మంచి రికార్డు ఉంది. ఇంగ్లండ్‌పై 21 టెస్టులాడిన ద్రవిడ్‌ 60.93 సగటుతో 1950 పరుగులు చేశాడు. ఇందు 7 సెంచరీలు,8 హాఫ్‌ సెంచరీలున్నాయి. ఇంగ్లండ్‌ గడ్డపై సైతం ద్రవిడ్‌ అద్భుత  ప్రదర్శన కనబర్చాడు. ఇక్కడ 13 టెస్టులాడిన అతను 68.80 సగటుతో 1376 పరుగులు చేశాడు. ఇందు ఆరు సెంచరీలుండటం విశేషం. ఈ లెక్కలనే చూపిస్తూ అభిమానులు కోచ్‌గా ద్రవిడ్‌ను తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు ట్రెంట్‌ బ్రిడ్స్‌ వేదికగా శనివారం నుంచి ప్రారంభంకానుంది. 5 టెస్టులో సిరీస్‌ వరుస రెండు ఓటములను మూటగట్టుకున్న కోహ్లిసేన ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది.

మరిన్ని వార్తలు