CWC 2023 Final: కోహ్లి కాదు!.. అతడి కోసం మేము కచ్చితంగా గెలవాల్సిందే: రోహిత్‌ శర్మ

19 Nov, 2023 12:31 IST|Sakshi

ICC CWC 2023 Final ind Vs Aus: వన్డే వరల్డ్‌కప్‌- 2011లో మహేంద్ర సింగ్‌ ధోని నాయకత్వంలోని భారత జట్టు ట్రోఫీ గెలిచి ఆ విజయాన్ని దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌కు అంకితం చేసింది.. విరాట్‌ కోహ్లి వంటి యువ ఆటగాడు సహా జట్టులోని ఇతర సభ్యులు ‘క్రికెట్‌ దేవుడి’ని తమ భుజాలపై మోస్తూ.. వాంఖడే స్టేడియమంతా తిప్పి సముచితంగా గౌరవించుకున్నారు.

రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్‌లో ఒక్కసారి కూడా వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలవలేదన్న లోటు.. సచిన్‌కు అలా ఆరో ప్రయత్నంలో తీరింది. కెరీర్‌లో ఆఖరి వన్డే ప్రపంచకప్‌ ఆడుతున్న అత్యుత్తమ ఆటగాడికి సొంతగడ్డపై.. అదీ అతడి సొంతమైదానంలో సహచరులు అలా గొప్ప కానుక అందించారు.

మళ్లీ పుష్కరకాలం తర్వాత భారత గడ్డపై వన్డే ప్రపంచకప్‌ టోర్నీ.. పది విజయాలతో టాప్‌గేర్‌లో ఫైనల్‌కు దూసుకువచ్చిన టీమిండియా ఆఖరి పోరులో ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగునంది.

ఈ నేపథ్యంలో.. నాడు క్రికెట్‌ గాడ్‌ సచిన్‌కు దక్కిన గౌరవం.. క్రికెట్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లికి దక్కితే చూడాలని అతడి అభిమానులు ఆశపడుతున్నారు. ఆసీస్‌ను చిత్తు చేసి టీమిండియా ట్రోఫీని ముద్దాడితే.. ఆ అపురూప క్షణాల్లో తమ రికార్డుల రారాజుకు కూడా.. నాడు సచిన్‌ మాదిరే పట్టం కట్టాలని ఆకాంక్షిస్తున్నారు.

కోహ్లికి ఈ విజయాన్ని అంకితం చేయాలని కోరుకుంటున్నారు. చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం 35 ఏళ్ల కోహ్లి కోసం భారత జట్టు టైటిల్‌ గెలిస్తే చూడాలని ఉందనే ఆకాంక్షను వెలిబుచ్చారు. అయితే, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. 

ఈసారి భారత జట్టు తమ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కోసం కప్పు గెలవాలని కోరుకుంటోందని రోహిత్‌ వ్యాఖ్యానించాడు. ద్రవిడ్‌ కెరీర్‌లో మిగిలిపోయిన లోటును తీర్చాలనుకంటున్నట్లు తెలిపాడు. కాగా 2003లో సౌరవ్‌ గంగూలీ సారథ్యంలోని భారత జట్టులో రాహుల్‌ ద్రవిడ్‌ సభ్యుడు.

సౌతాఫ్రికా వేదికగా జొహన్నస్‌బర్గ్‌లో జరిగిన నాటి ఫైనల్లో టీమిండియా- ఆస్ట్రేలియా తలపడ్డాయి. అప్పటి ఆసీస్‌ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌ 140, డామిన్‌ మార్టిన్‌ 88 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు 359 పరుగుల భారీ స్కోరు అందించారు.

అయితే, టీమిండియా టాపార్డర్‌లో ఓపెనర్‌ సచిన్‌ టెండుల్కర్‌ (4), వన్‌డౌన్‌ బ్యాటర్‌ గంగూలీ(24) విఫలం కాగా మరో ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ 82 పరుగులు సాధించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన రాహుల్‌ ద్రవిడ్‌ 47 పరుగులు రాబట్టాడు.

వీరిద్దరు మినహా మిగతా వాళ్లంతా కనీసం ముప్పై పరుగుల మార్కును దాటకపోవడంతో 234 పరుగులకే పరిమితమైంది టీమిండియా. దీంతో 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి ట్రోఫీని ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. అలా నాడు కంగారూల చేతిలో టీమిండియాకు పరాభవం ఎదురైంది.

కాలక్రమంలో ఇరవై ఏళ్ల తర్వాత.. నాటి భారత జట్టులో సభ్యుడైన ద్రవిడ్‌ మార్గదర్శనంలోని టీమిండియా ఇప్పుడు ఫైనల్‌కు చేరుకుంది. అదే ప్రత్యర్థితో మరోసారి తుదిపోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ గెలిచి ద్రవిడ్‌కు అంకితం చేయాలని రోహిత్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు.. ‘‘మేము ఇక్కడి దాకా చేరుకోవడంలో రాహుల్‌ భయ్యా పాత్ర ఎంతో కీలకం. ఆయన తన కెరీర్‌లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడారు. కోచ్‌గా ఉన్నప్పటికీ మాకు కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తూనే ఎలా ఆడాలో కూడా మార్గదర్శనం చేస్తారు.

గడ్డు పరిస్థితుల్లో ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్‌ సమయంలో మాకు ఆయన నైతికంగా ఎంతో మద్దతుగా నిలిచారు. సెమీ ఫైనల్లో ఓటమి తర్వాత మా లోపాలు సరిచేసి ఎలా ముందుకుసాగాలో నేర్పించారు. ఇలాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఆయన కోసం మేము కచ్చితంగా గెలిచి తీరాల్సిందే’’ అని రోహిత్‌ శర్మ రాహుల్‌ ద్రవిడ్‌పై అభిమానం చాటుకున్నాడు.

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు