డియర్‌ అంబటి రాయుడు.. సారీ మ్యాన్‌!

1 Jul, 2019 20:11 IST|Sakshi

ప్రస్తుత వరల్డ్‌ కప్‌లో టీమిండియా పరిస్థితి ఒకింత గందరగోళంగా తయారైంది. ఆటగాళ్లు వరుసగా గాయాలపాలవుతున్నారు. మరోవైపు సెలెక్టర్లు ఎన్నో ఆశలు పెట్టి.. ఎంపిక చేసిన ఆటగాళ్లు విఫలమవుతున్నారు. ఇప్పటికే గాయం కారణంగా డ్యాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ప్రపంచకప్‌ నుంచి తప్పుకున్నాడు. తాజాగా విజయ్‌శంకర్‌ కూడా అదే దారిలో గాయాలతో ఇంటిబాట పట్టాడు. స్టార్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కూడా గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. మరోవైపు సెలక్టర్లు కొండంత నమ్మకముంచిన కేదార్‌ జాధవ్‌ తాజాగా ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో అంచనాలకు తగ్గట్టు ఆడటంలో విఫలమయ్యాడు. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడి మీద పడింది. క్రికెట్‌ మెగా టోర్నీ వరల్డ్‌ కప్‌లో ఆడాలని ఈ వెటరన్‌ క్రికెటర్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కొంతకాలంగా నిలకడగా ఆడుతూ వస్తూ.. సెలక్టర్ల దృష్టిలో కూడా పడ్డాడు. అయితే, వరల్డ్‌ కప్‌ జట్టు ఎంపిక చేసే సమయంలో యువ ఆటగాడు విజయ్‌శంకర్‌ అనూహ్యంగా తెరపైకి రావడం.. అంబటి ఆశలపై నీళ్లు కుమ్మరించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌ కూడా చేయగల త్రీ డైమన్షన్‌ ఆటగాడు విజయ్‌శంకర్‌ అంటూ సెలెక్టర్లు అతన్ని ఆకాశానికెత్తారు. కానీ, తీరా వరల్డ్‌ కప్‌కు వచ్చేసరికి అతను ఆశించినమేర రాణించలేదు. సెలక్టర్లు చెప్పినట్టు ఏ డైమన్షన్‌లోనూ అతను ప్రతిభ చూపలేదు. అంతంతమాత్రం ఆటతీరుతో చివరకు గాయాలపాలై ఇంటిదారి పట్టాడు. 
(చదవండి: ‘త్రీడి కళ్లద్దాలు’ ఆర్డర్‌ ఇచ్చా: రాయుడు)

ఐనా..
ఒకవైపు గాయాలతో ఆటగాళ్లు ఇంటిదారి పడుతున్నా.. టీమిండియా సెలక్టర్లు మాత్రం అంబటి రాయుడిపై దృష్టి సారించడం లేదు. అంబటి రాయుడు, రిషబ్‌ పంత్‌కు ప్రపంచకప్‌ ద్వారాలు మూసుకుపోలేదని, ఎవరైనా గాయాలపాలైతే.. వారిని జట్టులోకి తీసుకుంటామంటూ.. ఆ ఇద్దరిని స్టాండ్‌బై ఆటగాళ్లుగా బీసీసీఐ ప్రకటించింది కూడా. అయినా, ఇప్పటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అంబటిని సెలక్టర్లు పట్టించుకోకపోవడం గమనార్హం. ధావన్‌ గాయంతో జట్టు నుంచి వైదొలగడంతో పంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. తాజాగా విజయ్‌ శంకర్‌ నిష్క్రమణ నేపథ్యంలో అంబటికి అవకాశం ఉంటుందని భావిస్తే.. ఆ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
(చదవండి: స్టాండ్‌బైగా పంత్, రాయుడు)

మరీ, అంబటి రాయుడిని స్టాండ్‌ బైగా ప్రకటించి.. ఎవరైనా ఆటగాళ్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తే.. అవకాశమిస్తామని చెప్పడమెందుకని అంబటి అభిమానులు ఇటు బీసీసీఐని, అంటు సెలక్టర్లు ప్రశ్నిస్తున్నారు. విజయ్‌శంకర్‌ను జట్టులోకి తీసుకున్నప్పుడు.. వరల్డ్‌ కప్‌ చూసేందుకు త్రీడీ గ్లాసులు ఆర్డర్‌ ఇచ్చానని రాయుడు వ్యంగ్యంగా ట్విటర్‌లో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించి.. సీరియస్‌గా తీసుకోవడం లేదని పేర్కొంది. అయినా, రాయుడి వ్యాఖ్యలు సెలక్టర్లను తీవ్రంగానే హార్ట్‌ చేసి ఉంటాయోమో... అందుకే అతన్ని జట్టులోకి తీసుకునే అవకాశం వచ్చినా సెలక్టర్లు మొగ్గు చూపడం లేదని వినిపిస్తోంది. టీమిండియాకు ఇప్పుడు బ్యాటింగ్‌ స్పెషలిస్ట్‌ అవసరముంది. బ్యాటింగ్‌లో అపార అనుభవమున్న రాయుడిని కాదని.. పెద్దగా అనుభవం లేని జూనియర్‌ ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశం కల్పించడం పరిశీలకులను విస్తుగొల్పుతుంది. 
(చదవండి: విజయ్‌ శంకరానందం)

ధావన్‌, విజయ్‌శంకర్‌ జట్టు నుంచి వైదొలిగినా.. అంబటికి అవకాశం ఇవ్వకపోవడంపై సోషల్‌ మీడియాలో అతని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలక్టర్లు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అంబటికి అండగా నిలుస్తున్నారు. తాజాగా నటుడు సిద్ధార్థ అంబటికి మద్దతుగా ట్వీట్‌ చేశారు. ‘డియర్‌ అంబటి రాయుడు.. నువ్వు దీని కన్నా ఎన్నోరెట్లు అర్హుడివి. సారీ మ్యాన్‌. ఈ చెత్తను పట్టించుకోకు. దృఢంగా ఉండు. నీ ప్రతిభకు, నీ పట్టుదలకు నీ నిలకడైన ఆటతీరుకు దీనికి ఏమాత్రం సంబంధం లేదు’ అంటూ అతన్ని జట్టులోకి తీసుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ సిద్ధార్థ్‌ ట్వీట్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు