IPL 2024: టెన్త్‌ క్లాస్‌తో చదువు బంద్‌.. వేలంలో కోట్ల వర్షం! ఎవరీ రాబిన్‌ మింజ్‌?

20 Dec, 2023 09:29 IST|Sakshi

ఐపీఎల్‌-2024 వేలంలో చాలా మంది భారత యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్‌ కోట్లు కుమ్మరించారు. ఈ జాబితాలో జార్ఖండ్ యువ సంచలనం రాబిన్ మింజ్‌ కూడా ఉన్నాడు. రాబిన్ మింజ్‌ను రూ. 3.6 కోట్ల భారీ ధరకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. 

రూ.20లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను సొంతం చేసుకునేందుకు ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌, గుజరాత్‌ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి గుజరాత్‌ దక్కించుకుంది. కాగా ఈ డీల్‌తో ఐపీఎల్‌ వేలం చరిత్రలో అమ్ముడుపోయిన మొట్టమొదటి గిరిజన క్రికెటర్‌గా  మింజ్‌ నిలిచాడు. ఈ క్రమంలో రాబిన్ మింజ్‌ కోసం ఆసక్తిర విషయాలు తెలుసుకుందాం.

ఎవరీ రాబిన్‌ మింజ్‌?
21 ఏళ్ల రాబిన్‌ మింజ్‌ జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలోని ఓ మధ్యతరగతి కుటుబంలో జన్మించాడు. అతడి తండ్రి ఇండియన్‌ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్‌ ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీలో పనిచేస్తున్నాడు. మింజ్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఇష్టం ఎక్కువ. ఈ క్రమంలో చదువును మింజ్‌ పక్కన పెట్టేశాడు. మింజ్‌ కేవలం పదివ తరగతి వరకే చదువుకున్నాడు. ఆ తర్వాత క్లబ్‌ క్రికెట్‌, అండర్‌-19, అండర్‌-25 టోర్నీల్లో జార్ఖండ్‌ తరపున మింజ్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

క్లబ్‌ క్రికెట్‌లో మింజ్‌కు ఏకంగా 140 పైగా స్ట్రైక్‌ రేట్‌ ఉంది. దీంతో మింజ్‌ ఈ ఏడాది ఆగస్టులో యూకే వేదికగా ముంబై ఇండియన్స్‌  ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌కు సెలక్ట్‌ అయ్యాడు. అదే విధంగా దేశీవాళీ టీ20 అరంగేట్రంలో కూడా మింజ్‌ సత్తాచాటాడు. ఒడిశా వేదిగా జరిగిన ఓ టీ20 టోర్నీలో తన తొలి మ్యాచ్‌లో మింజ్‌ కేవలం 35 బంతుల్లో 73 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

కాగా మింజ్‌ టీమిండియా లెజెండ్‌ ఎంఎస్‌ ధోనిని ఆదర్శంగా తీసుకుని క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అదే విధంగా మింజ్‌కు బౌలింగ్‌ చేసే సత్తా ఉంది. గుజరాత్‌ జట్టులో వృద్దిమన్‌ సాహాతో పాటు వికెట్‌ కీపర్ల జాబితాలో మింజ్‌ చేరాడు.
 

>
మరిన్ని వార్తలు