వాళ్లు వైన్‌లా షైన్‌ అవుతున్నారు : ధోని

10 Apr, 2019 10:22 IST|Sakshi

చెన్నై : సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్‌ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఐపీఎల్‌ సీజన్‌ 12లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ధోని సేన ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించిన యువ బౌలర్‌ దీపక్‌ చహర్‌ 3 వికెట్లు తీసి.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’  దక్కించుకోగా.. సీనియర్‌ ఆటగాళ్లు హర్భజన్‌, తాహిర్‌ రెండేసి వికెట్లు తీసి అతడికి అండగా నిలిచారు. ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి గెలిచింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం చెన్నై కెప్టెన్‌ ధోని మాట్లాడుతూ.. విజయానికి ప్రధాన కారణమైన బౌలర్లపై ప్రశంసలు కురిపించాడు.

‘వయస్సు గురించి పక్కన పెడితే వారిద్దరు వైన్‌లా రోజు రోజుకీ పరిణతి చెందుతున్నారు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో భజ్జీ మెరుగ్గా రాణించాడు. తాహిర్‌ కూడా గొప్పగా ఆడుతున్నాడు. నిజానికి మా బౌలర్లు ప్రతీ మ్యాచులో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఫ్లాటర్‌ వికెట్‌ ఉన్నపుడు బాగా ఆలోచించి కాంబినేషన్స్‌ సెట్‌ చేయాల్సి ఉంటుంది. తాహిర్‌ నన్ను పూర్తిగా నమ్ముతాడు. ఎక్కడ బంతి వేస్తే ఫలితం మెరుగ్గా ఉంటుందో చెప్పినపుడు తను తప్పకుండా అలాగే చేస్తాడు. తద్వారా చాలాసార్లు మంచి ఫలితాలు రాబట్టాం’ అని ధోని చెప్పుకొచ్చాడు. మొదటి మ్యాచ్‌లాగే ఈరోజు కూడా పిచ్‌ నేచర్‌ స్లోగా ఉందని, ఇలాంటి సమయాల్లో తక్కువ స్కోర్లకే పరిమితం కావాల్సి వస్తుందని క్యూరేటర్‌ను విమర్శించాడు. ఇక గాయం కారణంగా జట్టుకు దూరమైన డ్వేన్‌ బ్రావో గురించి మాట్లాడుతూ.. ‘ఆల్‌ రౌండర్‌ని మిస్సవడం వల్ల సరైన కాంబినేషన్లు సెట్‌ చేయడం ప్రస్తుతం కఠినంగా మారింది. బ్రేవోతో పాటు డేవిడ్‌ విల్లీ కూడా జట్టుతో లేకపోవడం కాస్త ఇబ్బంది పెట్టే అంశమే’ అని వ్యాఖ్యానించాడు.

>
మరిన్ని వార్తలు