ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌.. ఏడాది నిషేధం

18 Nov, 2019 16:45 IST|Sakshi

సిడ్నీ: క్రికెట్‌ జట్టు సమాచారాన్ని గోప్యంగా ఉంచకుండా తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ ఎమిలీ స్మిత్‌పై ఏడాది నిషేధం పడింది. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో భాగంగా ఈ నెల ఆరంభంలో సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హోబార్ట్‌ హరికేన్స్‌ క్రీడాకారిణి ఎమిలీ స్మిత్‌ జట్టు ఎలెవన్‌ పేర్లను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. మ్యాచ్‌ ఆరంభానికి గంట ముందు ఆమె జట్టులో ఎవరు ఆడుతున్నారో అనే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా బట్టబయలు చేశారు. ఇది క్రికెట్‌ నిబంధనలకు విరుద్ధం. క్రికెట్ ఆస్ట్రేలియా ఆర్టికల్ 2.3.2 ప్రకారం స్మిత్‌పై 12 నెలల నిషేధం పడింది.

ఈ పోస్ట్ బెట్టింగ్‌కు సంబంధించి ఉపయోగించబడే సమాచారానికి దారితీస్తుందని, జట్టు రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయడం నేరం అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఇది అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొన్న క్రికెట్‌ ఆస్ట్రేలియా.. ఎమిలీ స్మిత్‌పై 12 నెలల నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో బిగ్‌బాష్‌ లీగ్‌ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఏడాది నిషేధంలో స్మిత్‌పై తొమ్మిది నెలలు పూర్తి సస్పెన్షన్ కొనసాగనుంది. ఇక చివరి మూడు నెలలు అందుబాటులోకి వచ్చినా జట్టులో ఎంపికకు అనర్హురాలిగానే ఉండాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు