కోహ్లి కెప్టెన్సీలో తొలిసారి

18 Jul, 2018 09:17 IST|Sakshi

30 నెలల తర్వాత వన్డే సిరీస్‌ చేజార్చుకున్న టీమిండియా

లీడ్స్‌: టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ద్వైపాక్షిక సిరీస్‌ను టీమిండియా 1-2తో కోల్పోయింది. విరాట్‌ కోహ్లి సారథ్యంలో అప్రతిహత విజయాలతో దూసుకపోతున్న టీమిండియా జోరుకు వన్డేల్లో ‘నంబర్‌వన్‌’ జట్టు ఇంగ్లండ్‌ కళ్లెం వేసింది. కోహ్లి కెప్టెన్సీలో భారత్‌ ద్వైపాక్షిక సిరీస్‌ ఓడిపోవడం ఇదే తొలిసారి. 2013, 14లలో జింబాబ్వే, శ్రీలంకలతో వన్డే సిరీస్‌లకు తాత్కాలిక కెప్టెన్‌గా వహించి టీమిండియాను కోహ్లి గెలిపించాడు.

అనంతరం 2017లో ధోని నుంచి పూర్తి స్థాయి బాధ్యతలు విరాట్‌ కోహ్లి చేపట్టాడు. కొత్త నాయకుడి సారథ్యంలో టీమిండియా వరుసగా ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుచుకుంది. కాగా, ఈ విజయపరంపరకు ఇంగ్లండ్‌ బ్రేక్‌ వేసింది. ఈ ఓటమితో 30 నెలల తర్వాత తొలిసారి టీమిండియా దైపాక్షిక సిరీస్‌ను కోల్పోయింది. చివరిసారిగా(2016లో) ఆస్ట్రేలియా 4-1తో టీమిండియాపై ఘనవిజయం సాధించింది.

ఇంగ్లండ్‌ రికార్డులు..
టీమిండియాతో జరిగిన సిరీస్‌ను గెలవడంతో స్వదేశంలో ఇంగ్లండ్‌ వరుసగా ఏడు ద్వైపాక్షిక సిరీస్‌లు తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుసగా సిరీస్‌లు గెలవడం 2010-12 అనంతరం ఇదే తొలిసారి. ఇక వన్డేల్లో ఇంగ్లండ్‌ తరుపున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా జోయ్‌ రూట్‌(13) సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో మాజీ ఆటగాడు ట్రెస్కోథిక్‌(12) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.
 

మరిన్ని వార్తలు