ప్రేక్షకులు లేకుండా నిర్వహించలేం

19 May, 2020 02:37 IST|Sakshi

సింగపూర్‌ గ్రాండ్‌ప్రి నిర్వాహకులు

సింగపూర్‌: ప్రేక్షకులు లేకుండా సింగపూర్‌ ఫార్ములావన్‌ (ఎఫ్‌1) గ్రాండ్‌ప్రి రేసును నిర్వహించడం సాధ్యం కాదంటూ రేసు నిర్వాహకులు సోమవారం తెలిపారు. కరోనా కారణంగా మార్చిలో ఆరంభం కావాల్సిన 2020 ఎఫ్‌1 సీజన్‌... జూలైలో జరిగే ఆస్ట్రియా గ్రాండ్‌ప్రితో ఆరంభమయ్యే అవకాశం ఉంది. కరోనా ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఈ ఏడాది జరిగే రేసులను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించే యోచనలో ఎఫ్‌1 అధికారులు ఉన్నారు.

అయితే రాత్రి పూట వీధుల గుండా సాగే సింగపూర్‌ గ్రాండ్‌ప్రి ట్రాక్‌ను హోటల్స్, అపార్ట్‌మెంట్‌ల చుట్టూ నిర్మించారు. దాంతో ఈ గ్రాండ్‌ప్రిని ప్రేక్షకులు లేకుండా నిర్వహించడం కష్టమని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికైతే ఎట్టి పరిస్థితుల్లోనూ రేసును నిర్వహించడానికే ప్రయత్నిస్తున్నామని... అందుకోసం సింగపూర్‌ ప్రభుత్వంతో, ఎఫ్‌1 అధికారులతో చర్చిస్తున్నామని సింగపూర్‌ రేసు నిర్వాహకులు తెలిపారు. ఈ రేసు సెప్టెంబర్‌ 20న జరగాల్సి ఉంది. అయితే సింగపూర్‌లాగే వీధుల గుండా సాగే మొనాకో గ్రాండ్‌ప్రి ఇప్పటికే రద్దవగా... అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి వాయిదా పడింది.

>
మరిన్ని వార్తలు