హామిల్టన్‌ @ 90 

19 Jul, 2020 00:31 IST|Sakshi

హంగేరి గ్రాండ్‌ ప్రిలో పోల్‌ పొజిషన్‌

నేడు సా.గం.6.40 నుంచి ప్రధాన రేసు

బుడాపెస్ట్‌: అచ్చొచ్చిన ట్రాక్‌పై మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరోసారి దూసుకెళ్లాడు. తన కెరీర్‌లో 90వ పోల్‌ను సాధించాడు. శనివారం జరిగిన ఫార్ములా వన్‌ (ఎఫ్‌1) హంగేరి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో అందరికంటే వేగంగా ల్యాప్‌ను పూర్తి చేసిన అతను పోల్‌ సిట్టర్‌గా నిలిచాడు. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్‌ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. తాజా పోల్‌ విజయంతో ఏడో సారి ఈ ఘనత సాధించిన హామిల్టన్‌... ఇదే ట్రాక్‌పై అత్యధిక పోల్‌ పొజిషన్‌ల మైకేల్‌ షూమాకర్‌ రికార్డును సమం చేశాడు. క్వాలిఫయింగ్‌ చివరి సెషన్‌లో ల్యాప్‌ను ఒక నిమిషం 13.447 సెకన్లలో పూర్తి చేసిన హామిల్టన్‌ అగ్రస్థానంలో నిలవగా... మెర్సిడెస్‌కే చెందిన మరో డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ 0.107 సెకన్లు తేడాతో ల్యాప్‌ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది పోల్‌ పొజిషన్‌ సాధించిన రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఈ సారి మాత్రం ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

గ్రిడ్‌ పొజిషన్స్‌: 1. హామిల్టన్‌ (మెర్సిడెస్‌), 2. బొటాస్‌ (మెర్సిడెస్‌), 3. స్ట్రోల్‌ (రేసింగ్‌ పాయింట్‌), 4. పెరెజ్‌ (రేసింగ్‌ పాయింట్‌), 5. వెటెల్‌ (ఫెరారీ), 6. లెక్‌లెర్క్‌ (ఫెరారీ), 7. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌), 8. నోరిస్‌ (మెక్‌లారెన్‌), 9. సెయింజ్‌ (మెక్‌లారెన్‌), 10. గాస్లీ (అల్ఫా టోరి).

మరిన్ని వార్తలు