CWC 2023: కెప్టెన్‌గా ఇప్పటివరకు హిట్టే! బ్యాటర్‌గా మాత్రం ఫట్టు.. ఇలా అయితే ఎలా?

16 Nov, 2023 15:41 IST|Sakshi
బవుమా

ICC WC 2023- Temba Bavuma Batting Failure: వన్డే వరల్డ్‌కప్‌-2023లో సౌతాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమా బ్యాటింగ్‌ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 145 పరుగులు చేశాడు ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌. తాజాగా కీలక సెమీ ఫైనల్లో డకౌట్‌ అయ్యాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది.

కాగా భారత్‌ వేదికగా ప్రపంచకప్‌ టోర్నీలో ఆరంభం నుంచి అదరగొట్టింది సౌతాఫ్రికా. శ్రీలంకపై భారీ విజయంతో ఈవెంట్‌ను ఆరంభించిన సఫారీ జట్టు.. లీగ్‌ దశలో తొమ్మిదింట ఏడు విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ జట్లను చిత్తుగా ఓడించిన సఫారీలు భారీగా రన్‌రేటు మెరుగపరుచుకున్నారు.

లీగ్‌ దశలో ఏడు విజయాలతో సెమీస్‌కు
పాకిస్తాన్‌పై ఒక్క వికెట్‌ తేడాతో గట్టెక్కిన ప్రొటిస్‌ జట్టు.. అనూహ్యంగా నెదర్లాండ్స్‌ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత టీమిండియా చేతిలో ఏంకగా 243 పరుగుల తేడాతో మట్టికరిచింది. ఇక అఫ్గనిస్తాన్‌పై విజయంతో లీగ్‌ దశను ముగించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

క్వింటన్‌ డికాక్‌, ఎయిడెన్‌ మార్కరమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, మార్కో జాన్సెన్‌, కగిసో రబడ వంటి కీలక ప్లేయర్లు అత్యుత్తమంగా రాణించడంతో సౌతాఫ్రికా మరోసారి సెమీస్‌లో అడుగుపెట్టగలిగింది. కెప్టెన్‌గా ఇలా హిట్టయినప్పటికీ బ్యాటర్‌గా మాత్రం పేలవ ప్రదర్శన కనబరిచాడు తెంబా బవుమా.

A post shared by ICC (@icc)

ఆసీస్‌ పేసర్ల దెబ్బకు సఫారీల విలవిల
ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో నెట్టింట అతడిపై ట్రోలింగ్‌ మొదలైంది. కాగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించిన సఫారీలు తుదిజట్టులో అదనపు స్పిన్నర్‌ను చేర్చుకున్నారు. కేశవ్‌ మహరాజ్‌తో పాటు తబ్రేజ్‌ షంసీని ఆడించేందుకు సిద్ధమైంది మేనేజ్‌మెంట్‌.

అయితే, పిచ్‌ పేసర్లకు అనుకూలిస్తుండటం ఆస్ట్రేలియాకు వరంగా మారింది. తొలి ఓవర్‌ ఆఖరి బంతికి బవుమాను పెవిలియన్‌కు పంపిన మిచెల్‌ స్టార్క్‌.. హిట్టర్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌(10) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

మరో పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ క్వింటన్‌ డికాక్‌(3), రాస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌(6) రూపంలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. వర్షం కారణంగా 14వ ఓవర్‌ వద్ద ఆట నిలిపివేసే సమయానికి సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది.

మరిన్ని వార్తలు