-

‘పంత్‌ వద్దు.. రహానే బెటర్‌’

12 Jun, 2019 20:39 IST|Sakshi

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ స్థానంలో ఎవరిని తీసుకోవాలనే దానిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే రిషభ్ పంత్‌ను బ్యాకప్‌ ప్లేయర్‌గా ఇంగ్లండ్‌కు పంపించడంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా మరి కొందరు పెదవి విరుస్తున్నారు. ప్రపంచకప్‌లో ధావన్‌ స్థానంలో పంత్‌ను జట్టులోకి తీసుకోవాలని సునీల్‌ గవాస్కర్‌, కెవిన్‌ పీటర్సన్‌లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా, మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు. ధావన్‌ స్థానంలో సీనియర్‌ ఆటగాడైన అంబటి రాయుడుని జట్టులోకి తీసుకోవాలన్నాడు.
కపిల్ దేవ్‌ మరింత భిన్నంగా..
ధావన్‌ స్థానంలో పంత్, అంబటి రాయుడి కంటే అజింక్యా రహానేను ఎంపిక చేయాలని మరింత భిన్నంగా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ సూచించాడు. పెద్ద టోర్నీలు ఆడిన అనుభవం రహానేకి ఉందన్నాడు. అలాగే ఓపెనర్‌గానూ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గానూ రహానే జట్టులో ఒదిగిపోతాడని కపిల్ పేర్కొన్నాడు. ఇదే అభిప్రాయాన్ని టీమిండియా వెటరన్‌ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ కూడా వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తన దృష్టిలో ధావన్‌ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లలో పంత్‌, రహానేలు ముందు వరుసలో ఉంటారని భజ్జీ అన్నాడు. 

అయితే అనుభవంపరంగా, ఇంగ్లాండ్‌ పిచ్‌లను దృష్టిలో పెట్టుకొని చూస్తే రహానే బెటర్‌ ఆప్షన్‌ అని పేర్కొన్నాడు. సాధారణంగా అతను మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తాడని.. కానీ ఇటీవల మూడో స్థానంలోనూ ఆడగలిగే టెక్నిక్‌ సాధించాడన్నాడు. గత ప్రపంచకప్‌(2015)లోనూ జట్టుకు ఉపయుక్తకరమైన ఇన్నింగ్‌లు ఆడాడని ఈ వెటరన్‌ స్పిన్నర్‌ అభిప్రాయపడ్డాడు. ఇక బీసీసీఐ పిలుపు మేరకు రిషభ్‌ పంత్ ఇప్పటికే ఇంగ్లండ్‌కు బయలుదేరి వెళ్లాడు. అయితే ధావన్ స్థానంలో రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

చదవండి:
ఇంగ్లండ్‌కు పయనమైన పంత్‌
తిరిగొస్తా.. గాయంపై శిఖర్‌ ధావన్‌

మరిన్ని వార్తలు