ఆమ్లా సెంచరీ: దక్షిణాఫ్రికా 266/2

20 Jan, 2019 01:53 IST|Sakshi

పోర్ట్‌ ఎలిజబెత్‌: వెటరన్‌ ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా (120 బంతుల్లో 108 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) చాన్నాళ్ల తర్వాత తనదైన స్థాయి ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడి అజేయ శతకంతో పాటు అరంగేట్ర ఆటగాడు వాన్‌ డెర్‌ డసెన్‌ (101 బంతుల్లో 93; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరవడంతో శనివారం పాకిస్తాన్‌తో తొలి వన్డేలో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. మరో ఓపెనర్‌ హెన్‌డ్రిక్స్‌ (67 బంతుల్లో 45; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.

ఆమ్లా, హెన్‌డ్రిక్స్‌ తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించారు. 18వ ఓవర్లో షాదాబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో హెన్‌డ్రిక్స్‌ ఔటయ్యాడు. అనంతరం ఆమ్లా, వాన్‌ డెర్‌ రెండో వికెట్‌కు 155 పరుగులు జత చేశారు. సెంచరీ దిశగా సాగుతున్న వాన్‌ డెర్‌ 47వ ఓవర్లో హసన్‌ అలీ బౌలింగ్‌లో షోయబ్‌ మాలిక్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. హఫీజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 48వ ఓవర్‌ చివరి బంతిని సిక్సర్‌గా మలిచి ఆమ్లా కెరీర్‌లో 27వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ కడపటి వార్తలు అందే సమయానికి 42 ఓవర్లలో నాలుగు వికెట్లకు 223 పరుగులు చేసింది.    

మరిన్ని వార్తలు