శ్రీకాంత్‌ సాధించెన్‌...

23 Oct, 2017 04:12 IST|Sakshi

డెన్మార్క్‌ ఓపెన్‌ చాంపియన్‌గా తెలుగు తేజం

కేవలం 25 నిమిషాల్లో ఫైనల్లో విజయం

శ్రీకాంత్‌ ధాటికి తేలిపోయిన కొరియా ప్రత్యర్థి

ఇలా వచ్చాడు. అలా గెలిచాడు. టీవీ ముందున్న అభిమానులను... కోర్టులో ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేస్తూ... భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ డెన్మార్క్‌ ఓపెన్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. నమ్మశక్యంకానిరీతిలో కేవలం 25 నిమిషాల్లోనే ఫైనల్‌ను ముగించాడు. బరిలో దిగిన తొలి క్షణం నుంచే దక్షిణ కొరియా ఫైనల్‌ ప్రత్యర్థి లీ హున్‌ ఇల్‌ను హడలెత్తించి అద్వితీయ పద్ధతిలో విజేతగా అవతరించాడు. ఈ విజయంతో శ్రీకాంత్‌ ఈ ఏడాది తన ఖాతాలో మూడో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. తద్వారా సైనా నెహ్వాల్‌ తర్వాత ఒకే ఏడాదిలో మూడు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ నెగ్గిన రెండో భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.   

ఈ టోర్నీలో లీ హున్‌ ఇల్‌ అద్భుతంగా ఆడాడు. మేమిద్దరం గతంలో ముఖాముఖిగా ఆడకపోయినా ఈ టోర్నీలో అతని మ్యాచ్‌లను పరిశీలించి వ్యూహం సిద్ధం చేసుకున్నాను. నా బలం అటాకింగ్‌. ఆరంభం నుంచి దూకుడుగానే ఆడాలని నిర్ణయించుకున్నాను. నిలకడగా పాయింట్లు రావడంతో నా వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ సీజన్‌లో మూడో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ సాధించినందుకు ఆనందంగా ఉంది. వచ్చే వారం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడతాను. ఈ సీజన్‌లో మిగిలిన టోర్నీల్లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగించాలని అనుకుంటున్నాను.  –‘సాక్షి’తో శ్రీకాంత్‌

ఒడెన్స్‌: బహుశా ఎవరూ ఊహించకపోయుండొచ్చు డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ను శ్రీకాంత్‌ ఇంత అలవోకగా గెలుస్తాడని..! అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో ప్రస్తుత పోటీదృష్ట్యా ఓ సూపర్‌ సిరీస్‌ టోర్నీ ఫైనల్‌ ఆద్యంతం హోరాహోరీగా సాగుతుందని భావించిన వారందరూ ఆదివారం ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు. ఈ సీజన్‌లో తన అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ మూడో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ను దక్కించుకున్నాడు. కేవలం 25 నిమిషాల్లో ముగిసిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 21–10, 21–5తో ప్రపంచ 22వ ర్యాంకర్‌ లీ హున్‌ ఇల్‌ (దక్షిణ కొరియా)ను చిత్తుగా ఓడించాడు. విజేతగా నిలిచిన శ్రీకాంత్‌కు 56,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 36 లక్షల 58 వేలు)తోపాటు 11,000 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌ లీ హున్‌ ఇల్‌కు 28,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 53 వేలు)తోపాటు 9,350 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

తొలి గేమ్‌లో 7... రెండో గేమ్‌లో 11
సెమీస్‌లో టాప్‌ సీడ్‌ సన్‌ వాన్‌ హో (కొరియా)తో 92 నిమిషాలు ఆడి మూడు గేముల్లో అతడిని ఓడించడం... 20 ఏళ్లుగా అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఆడుతుండటం... 615 మ్యాచ్‌ల అనుభవం... ఇలా ఏ రకంగా చూసినా శ్రీకాంత్‌తో ఫైనల్లో తలపడిన ప్రత్యర్థి లీ హున్‌ ఇల్‌ ప్రతిభను తక్కువ అంచనా వేయలేం. అయితేనేం ఇవేమీ శ్రీకాంత్‌ పట్టించుకోలేదు. కేవలం తనకు తెలిసిన పద్ధతిలో ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. తొలి గేమ్‌ ఆరంభంలో వరుసగా రెండు పాయింట్లు కోల్పోయిన శ్రీకాంత్‌ ఆ తర్వాత చెలరేగాడు. వరుసగా రెండు లేదా మూడు పాయింట్లు సాధిస్తూ ముందుకు సాగాడు. స్కోరు 13–8 వద్ద శ్రీకాంత్‌ వరుసగా 7 పాయింట్లు గెలిచి 20–8తో ఆధిక్యంలోకి వెళ్లాడు.

అనంతరం లీ హున్‌ రెండు పాయింట్లు గెలిచినా, శ్రీకాంత్‌ మరో పాయింట్‌ నెగ్గి తొలి గేమ్‌ను 13 నిమిషాల్లో దక్కించుకున్నాడు. ఇక రెండో గేమ్‌లోనూ శ్రీకాంత్‌ తొలి పాయింట్‌ను ప్రత్యర్థికి కోల్పోయాడు. ఆ తర్వాత ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ విశ్వరూపమే చూపించాడు. ఒకటా... రెండా... వరుసగా 11 పాయింట్లు గెలిచి 11–1తో ఈ తెలుగు తేజం ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత కూడా శ్రీకాంత్‌ తన జోరును కొనసాగించడంతో లీ హున్‌ రెండో గేమ్‌ను 12 నిమిషాల్లో కోల్పోయి చేతులెత్తేశాడు.  అంతర్జాతీస్థాయిలో నేను చూసిన ఏకపక్ష ఫైనల్‌ ఇదేనేమో! మా ప్రణాళికలన్నీ కోర్టులో శ్రీకాంత్‌ పక్కాగా అమలు చేశాడు. శ్రీకాంత్‌ ఆటతీరుకు తగ్గట్టుగా కోర్టులో పరిస్థితులు ఉన్నాయి. షటిల్‌ గమనాన్ని శ్రీకాంత్‌ అనుకూలంగా మార్చుకొని ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.

–‘సాక్షి’తో పుల్లెల గోపీచంద్, చీఫ్‌ కోచ్‌
► డెన్మార్క్‌ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ భారత ప్లేయర్‌కు లభించడం 37 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1980లో ప్రకాశ్‌ పదుకొనె ఈ టైటిల్‌ను సాధించగా... ఇపుడు శ్రీకాంత్‌ ఆయన సరసన నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో మాత్రం 2012లో సైనా నెహ్వాల్‌ ఈ టైటిల్‌ను సాధించింది.  
► ఈ సీజన్‌లో శ్రీకాంత్‌ సాధించిన సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ సంఖ్య (ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, డెన్మార్క్‌ ఓపెన్‌).
► ఒకే ఏడాది మూడు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ గెలిచిన భారత క్రీడాకారులు. 2010లో సైనా నెహ్వాల్‌ మహిళల సింగిల్స్‌లో (సింగపూర్, ఇండోనేసియా, హాంకాంగ్‌ ఓపెన్‌ టైటిల్స్‌) ఈ ఘనత సాధించగా... తాజాగా శ్రీకాంత్‌ పురుషుల సింగిల్స్‌లో ఈ అద్భుతం చేశాడు.

మరిన్ని వార్తలు