IPL 2024: ఆర్సీబీలోకి రచిన్‌ రవీంద్ర.. హింట్‌ ఇచ్చిన యువ సంచలనం!

10 Nov, 2023 19:08 IST|Sakshi

న్యూజిలాండ్‌ యువ సంచలనం రచిన్ రవీంద్ర.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అరంగేట్ర వరల్డ్‌కప్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ రికార్డులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు. కేవలం 23 ఏళ్ల వయస్సులోనే ప్రపంచస్థాయి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో మూడు సెంచరీలతో చెలరేగిన రవీంద్ర.. ప్రస్తుతం టోర్నీ టాప్‌ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

టోర్నీలో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన రచిన్‌.. 565 పరుగులు చేశాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ రవీంద్ర అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర.. అనంతరం బ్యాటింగ్‌లో 42 పరుగులు చేశాడు. కాగా రవీంద్ర  భారత సంతతికి చెందిన క్రికెటర్ అనే విషయం తెలిసిందే.

బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి, 1990ల్లోనే న్యూజిలాండ్‌కి వెళ్లి అక్కడ స్ధిరపడ్డారు. రవీంద్ర కూడా అక్కడే పుట్టాడు.  2021లో టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌తో రవీంద్ర న్యూజిలాండ్‌ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

ఆర్సీబీలోకి రవీంద్ర..!
కాగా వరల్డ్‌కప్‌లో అదరగొడుతున్న రవీంద్ర ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరపున ఆడాలని భావిస్తున్నట్లు పరోక్షంగా హింట్‌ ఇచ్చాడు. శ్రీలంకతో మ్యాచ్‌తో అనంతరం రవీంద్ర మాట్లాడుతూ.. "బెంగళూరు,  చిన్నస్వామి స్టేడియం  అంటే నాకు చాలా ఇష్టం.

ఈ రెండు నా  హృదయానికి చాలా దగ్గరగా ఉన్నాయి. భవిష్యత్తులో నేను ఇక్కడ మరింత క్రికెట్ ఆడతానని ఆశిస్తున్నాను’’ అని నవ్వుతూ అన్నాడు. కాగా ఇప్పటికే చాలా మంది యువ సంచలనాలకు అవకాశమిచ్చిన ఆర్సీబీ .. రచిన్‌ను కూడా తన అక్కున చేర్చుకుంటుందో లేదో చూడాలి మరి.  కాగా ఐపీఎల్‌-2024 సీజన్‌కు సంబంధించిన మినీవేలం డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా జరగనుంది.
చదవండి: టీవీల ముందు కూర్చుని ఎవరైనా సలహాలు ఇస్తారు.. అలా కాకుండా: బాబర్‌ ఆజం


 

మరిన్ని వార్తలు