వైరల్‌ : క్లీన్‌బౌల్డ్‌తో సిక్సర్‌ చూశారా?

10 Jun, 2019 13:18 IST|Sakshi
వికెట్‌ను తాకి నేరుగా బౌండరీలో పడిన బంతి

లండన్‌ : క్లీన్‌బౌల్డ్‌ అయిన తర్వాత సిక్సర్‌ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును బంతి వికెట్లను తాకి మరి నేరుగా బౌండరీలైన్‌ బయట పడింది. బహుషా క్రికెట్‌ చరిత్రలోనే ఇలాంటి సిక్సర్‌ చూసి ఉండరు. వికెట్‌ అయిన తర్వాత సిక్సర్‌ ఎలా అవుతుందంటారా? అవును అది సిక్సర్‌ కాదు వికెటే! కానీ కళ్లను మైమరిపించే ఈ అబ్బురం తాజా ప్రపంచకప్‌లోనే చోటుచేసుకుంది. శనివారం ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం ఔరా అనిపించింది. ఇంగ్లండ్‌ సంచలనం జోఫ్రా ఆర్చర్‌ మహత్యంతోనే ఇది జరిగింది.. చరిత్రకెక్కింది. (చదవండి: బంగ్లాపై ఇంగ్లండ్‌ అదరహో)

ఇంతకు ముందు బ్యాట్స్‌మన్‌ హెల్మెట్‌కు తాకి సిక్సర్‌ వెళ్లడం చూశాం కానీ.. ఇలా బెయిల్స్‌ తాకి సిక్సర్‌గా వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ సౌమ్య సర్కార్‌ ఈ బంతికి బలవ్వగా.. ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. ఆర్చర్‌ ఏకంగా గంటకు 144 కిలోమీటర్ల వేగంతో లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతిని వేయడంతో అది వికెట్లను తాకి నేరుగా 59 మీటర్ల దూరంలో ఉన్న బౌండరీలో పడింది. ఇక ఈ డెలివరి పట్ల ఆర్చర్‌ తెగ ఆనందపడిపోయాడు. ఇంత వరకు ఇలాంటిది ఎప్పుడు చూడలేదని, ఇది తన వేగానికి సంకేతమని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ట్వీట్‌ చేయడంతో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.  

మరిన్ని వార్తలు