విశ్వ కిరీటం... పుట్టింటికా? కివీ గూటికా?

14 Jul, 2019 05:30 IST|Sakshi
మోర్గాన్, విలియమ్సన్‌

నేడు ప్రపంచ కప్‌ ఫైనల్‌

ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్‌ అమీతుమీ

విఖ్యాత లార్డ్స్‌ మైదానంలో సమరం

విజేత ఎవరైనా వన్డే క్రికెట్‌కు కొత్త చాంపియనే

మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

ప్రారంభంలో చప్పగా సాగుతోందన్నారు వారాలు గడుస్తున్నా ఊపు లేదన్నారు మ్యాచ్‌లు తరుగుతున్నా మజా ఏదన్నారు మధ్యలోకి వచ్చేసరికి కాక మొదలైంది రంజైన మ్యాచ్‌లతో ఆట రక్తి కట్టింది ఇప్పుడిక ప్రపంచ కప్‌ ఆఖరి అంకం 46వ రోజున 48వ మ్యాచ్‌తో ముగింపు వన్డే కిరీటం ఎవరిదో తేలిపోయే సందర్భం రానున్న నాలుగేళ్లకు రారాజు పట్టాభిషేకం దూకుడైన ఇంగ్లండ్‌... నిబ్బరంగా న్యూజిలాండ్‌ జగజ్జేత హోదా పుట్టింటికి దక్కుతుందా? రెక్కలు కట్టుకుని కివీస్‌ గూటిలో వాలుతుందా?  క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో... అందమైన బాల్కనీ నుంచి... సగర్వంగా కప్‌ను చూపే కెప్టెన్‌ ఎవరో? మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెర తర్వాత తెరపైకి ‘సరికొత్త విజేత’ అభిమానులూ... ఆస్వాదించండి!  

లండన్‌: వన్డే క్రికెట్‌లో 23 ఏళ్ల తర్వాత సరికొత్త చాంపియన్‌ ఆవిర్భావానికి 12వ ప్రపంచ కప్‌ వేదిక కాబోతోంది. తొలిసారి జగజ్జేతగా నిలిచేందుకు లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఆదివారం ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ తుది సమరంలో తలపడనున్నాయి. మ్యాచ్‌లో ఎవరు గెలిచినా అది వారి దేశ చరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలిపోనుంది. ఇరు జట్ల బలాబలాల ప్రకారం చూస్తే ఈ ఫైనల్‌ను బ్యాటింగ్, పేస్‌ బౌలింగ్‌ మధ్య పోటీగా పేర్కొనవచ్చు. దూకుడైన ఆటతో పైచేయి సాధించడం ఇంగ్లండ్‌ వ్యూహం కాగా... నెమ్మదిగా పట్టు బిగించే స్వభావం న్యూజిలాండ్‌ది. మరి అంతిమ పోరులో ఎవరి ప్రణాళికలు విజయవంతం అవుతాయో చూడాలి?

మార్పుల్లేకుండానే!
అత్యంత కీలక మ్యాచ్‌ కాబట్టి రెండు జట్లు తాము సెమీఫైనల్లో ఆడిన తుది పదకొండు మందితోనే ఫైనల్లో దిగే వీలుంది. పైకి కనిపించకున్నా అటు ఇటు ఒకరిద్దరు ఆటగాళ్లే కీలకం. జేసన్‌ రాయ్, రూట్‌ను త్వరగా ఔట్‌ చేస్తే ఆతిథ్య జట్టు పరోక్షంగానైనా ఆత్మరక్షణలో పడటం ఖాయం. ఈ నేపథ్యంలో విధ్వంసక జాస్‌ బట్లర్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ నమోదవాల్సి ఉంటుంది. అనంతరం కెప్టెన్‌ మోర్గాన్, ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ బాధ్యతలు తీసుకుంటారు.

ఇక విలియమ్సన్, రాస్‌ టేలర్‌ తేలిపోతే న్యూజిలాండ్‌ పని ఖతం. అసలే ఆ జట్టు ఓపెనర్లు గప్టిల్, నికోల్స్‌ పేలవ ఫామ్‌తో సతమతం అవుతోంది. లాథమ్, గ్రాండ్‌హోమ్, నీషమ్‌ అదనపు పరుగులు జోడించగలరు తప్ప పరిస్థితిని అమాంతం మార్చలేరు. మొత్తమ్మీద చూస్తే బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంతో ఉన్నందున ఇంగ్లండ్‌కు ఫేవరెట్‌ మార్కులు ఎక్కువగా పడతాయి. బ్యాటింగ్‌లో బలహీనంగా ఉన్నా టోర్నీలో కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకుని గెలిచినందున కివీస్‌ను తేలిగ్గా తీసుకోలేం.

చరిత్ర బాటలో ఈ ఇద్దరు
ఐర్లాండ్‌ జాతీయుడైన మోర్గాన్‌ ఇంగ్లండ్‌ తరఫున ఆడటమే అనూహ్యం అనుకుంటే, కెప్టెన్‌గానూ ఎదిగి, ఇప్పుడు ప్రపంచ కప్‌ సాధించే వరకు తీసుకొచ్చాడు. గాటింగ్, గూచ్‌ వంటి మహామహులకు సాధ్యం కాని ఈ చిరకాల స్వప్నాన్ని గనుక నెరవేరిస్తే మోర్గాన్‌ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అటు విలియమ్సన్‌కూ అంతే స్థాయిలో ఖ్యాతి దక్కుతుంది. మార్టిన్‌ క్రో, బ్రెండన్‌ మెకల్లమ్‌ వంటి తమ దేశ దిగ్గజాలకు త్రుటిలో చేజారిన కప్‌ను సాధిస్తే... ఇప్పటికే ప్రపంచ శ్రేణి బ్యాట్స్‌మన్‌గా పేరున్న అతడు వ్యక్తిగతంగా మరో మెట్టెక్కుతాడు.

నాలుగోసారి... రెండోసారి....
ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడటం ఇది నాలుగోసారి. 1979, 87, 92లలో ఆ జట్టు తుది సమరానికి అర్హత సాధించింది. న్యూజిలాండ్‌ 2015 కప్‌ రన్నరప్‌. చిత్రమేమంటే ఇంగ్లండ్‌ ఆటగాళ్లందరికీ ఇదే తొలి ఫైనల్‌. కివీస్‌ తరఫున గత ఫైనల్‌ మ్యాచ్‌ ఆడిన గప్టిల్, విలియమ్సన్, టేలర్, బౌల్ట్, హెన్రీ ఈసారీ బరిలో దిగనున్నారు.

అటో గోడ.. ఇటో గోడ
ఇరు జట్లలో అంత తొందరగా బద్దలు కొట్టలేనంతటి రెండు బ్యాటింగ్‌ గోడలున్నాయి. అవే విలియమ్సన్‌ , రూట్‌ (549 పరుగులు). పోటాపోటీగా రాణించిన ఈ ఇద్దరూ సమవయస్కులే. ఒకే తరహా బ్యాటింగ్‌ శైలి వారే. తమ జట్ల విజయాల్లో కీలకంగా మారినవారే. ఎలాంటి సందర్భంలోనైనా ఇన్నింగ్స్‌లు నిర్మించగలవారే. ఫైనల్లో ఎవరు తమ పాత్ర సమర్థంగా పోషిస్తారో చూద్దాం.

వీరి సమరం ఆసక్తికరం
రాయ్, బెయిర్‌స్టో x బౌల్ట్, హెన్రీ 
జేసన్‌ రాయ్‌ (426 పరుగులు), బెయిర్‌స్టో (496 పరుగులు)... టోర్నీలో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్‌ జంట. గాయంతో రాయ్‌ దూరమైతే ఓ దశలో సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నది జట్టు. అప్పుడు బెయిర్‌స్టో ఒంటరివాడైనట్లు కనిపించాడు. భారత్‌తో మ్యాచ్‌లో రాయ్‌ పునరాగమనంతో ఈ జోడీ మళ్లీ తడాఖా చూపుతోంది. ఫైనల్లో వీరికి న్యూజిలాండ్‌ పేసర్లు బౌల్ట్‌ (17 వికెట్లు), హెన్రీ (13 వికెట్లు) అడ్డుకట్ట వేస్తే ఇంగ్లండ్‌కు ముకుతాడు పడినట్లే. కచ్చితమైన లెంగ్త్‌లో బౌలింగ్‌ చేసే ఈ జోడీకి మరో పేసర్‌ లాకీ ఫెర్గూసన్‌ (18 వికెట్లు) తోడైతే ఆతిథ్య జట్టుకు కష్టాలు తప్పవు.


విలియమ్సన్, టేలర్‌ X ఆర్చర్, వోక్స్‌

న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరిందంటే అది కెప్టెన్‌ విలియమ్సన్‌ (548 పరుగులు) విశేష రాణింపు, రాస్‌ టేలర్‌ (335 పరుగులు) నిలకడతోనే. భారత్‌తో జరిగిన సెమీస్‌లో వీరి అర్ధ సెంచరీలే ఈ విషయాన్ని చాటుతాయి. ఈ ఇద్దరికీ ఇంగ్లండ్‌ పేసర్లు ఆర్చర్‌ (19 వికెట్లు), వోక్స్‌ (13 వికెట్లు) నుంచి సవాల్‌ ఎదురవడం ఖాయం. మూడో పేసర్‌ మార్క్‌ వుడ్‌ (17 వికెట్లు) కూడా తక్కువేం కాదు. కేన్‌–టేలర్‌ జోడీ... వీరిని కాచుకొని క్రీజులో నిలదొక్కుకుంటే న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగే అవకాశం ఉంటుంది.స్పిన్నర్లూ ఉన్నారోయ్‌...

బ్యాటింగ్‌కు అనుకూలమైనా, పేసర్లు పండుగ చేసుకుంటున్నా ఈ కప్‌లో స్పిన్నర్లూ అంతోఇంతో ప్రభావం చూపారు. అలాంటివారిలో ఆదిల్‌ రషీద్‌ (ఇంగ్లండ్, 11 వికెట్లు), సాన్‌ట్నర్‌ (న్యూజిలాండ్, 6 వికెట్లు) ముఖ్యులు. స్పిన్‌ను సమర్థంగా ఆడే భారత్‌ను సెమీస్‌లో సాన్‌ట్నర్‌ కట్టి పడేశాడు. రషీద్‌... ఆస్ట్రేలియాపై నిర్ణయాత్మక ప్రదర్శన కనబర్చాడు. ఇక ఫైనల్స్‌లో అవసరమైన సందర్భంలో వీరు ఎలాంటి పాత్ర పోషిస్తారో?

తుది జట్లు (అంచనా)
ఇంగ్లండ్‌: జేసన్‌ రాయ్, బెయిర్‌స్టో, రూట్, మోర్గాన్‌ (కెప్టెన్‌), స్టోక్స్, బట్లర్, వోక్స్, ప్లంకెట్, ఆర్చర్, రషీద్, మార్క్‌ వుడ్‌.
న్యూజిలాండ్‌: గప్టిల్, నికోల్స్, విలియమ్సన్‌ (కెప్టెన్‌), రాస్‌ టేలర్, నీషమ్, లాథమ్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, హెన్రీ, బౌల్ట్, ఫెర్గూసన్‌.

పిచ్, వాతావరణం
శనివారం వరకు పిచ్‌పై సన్నటి పొరలా పచ్చిక ఉంది. వేడి ప్రభావంతో ఆదివారం మ్యాచ్‌ సమయానికి అది ఎండిపోవచ్చు. తద్వారా సహజ స్వభావంతో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. పిచ్‌ను పరిశీలించిన మోర్గాన్‌ మ్యాచ్‌ మొదలయ్యే వేళకు ఓ అంచనాకు రావొచ్చని అన్నాడు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఫైనల్‌కూ రిజర్వ్‌ డే ఉంది. ఆదివారం వర్షం వల్ల అంతరాయం కలిగి ఫలితం రాకపోతే సోమవారం కొనసాగిస్తారు. ఒకవేళ ఫైనల్‌ ‘టై’ అయితే ‘సూపర్‌ ఓవర్‌’ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. మ్యాచ్‌ రద్దయితే మాత్రం రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.  

ముఖాముఖిలో పోటాపోటీ...
ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 90 మ్యాచ్‌లు జరిగాయి. న్యూజిలాండ్‌ 43 మ్యాచ్‌లు, ఇంగ్లండ్‌ 41 గెలిచాయి. రెండు ‘టై’ కాగా, నాలుగింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో 9 సార్లు ఎదురుపడగా ఐదుసార్లు కివీస్, నాలుగుసార్లు ఇంగ్లండ్‌ నెగ్గాయి.

మరిన్ని వార్తలు