టీమిండియా భారీ స్కోరు; ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌

3 Oct, 2019 16:11 IST|Sakshi

విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా టీమిండియా తన ఇన్నింగ్స్‌ను 502/7 వద్ద డిక్లేర్డ్‌ చేసింది.  టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్‌ అగర్వాల్‌(215; 371 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లు) డబుల్‌ సెంచరీకి జతగా, రోహిత్‌ శర్మ( 176; 244 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ సెంచరీ చేయడంతో ఐదు వందల మార్కును చేరింది.202/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన భారత్‌ 317 పరుగుల వద్ద రోహిత్‌ వికెట్‌ను కోల్పోయింది. ఈ రోజు ఆటలో మరో 115 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్‌ శర్మ ఔటయ్యాడు.

మహరాజ్‌ వేసిన 82 ఓవర్‌ ఆఖరి బంతిని ముందుకొచ్చి ఆడబోయిన రోహిత్‌ స్టంపింగ్‌ అయ్యాడు. దాంతో భారత్‌ తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కాగా, మయాంక్‌ మాత్రం అత్యంత నిలకడగా ఆడి డబుల్‌ సెంచరీ సాధించాడు. సెంచరీ సాధించడానికి 203 బంతులు ఎదుర్కొంటే.. దాన్ని డబుల్‌ సెంచరీగా మలుచుకోవడానికి మరో 155 బంతులు ఆడాడు.  పుజారా(6), కోహ్లి(20), రహానే(15), హనుమ విహారి(10)లునిరాశపరిచినా, వృద్ధిమాన్‌ సాహా(21) స్కోరును పెంచే క్రమంలో పెవిలియన్‌ చేరాడు. రవీంద్ర జడేజా(30 నాటౌట్‌) ఆకట్టుకున్నాడు. ఐదు వందల మార్కు దాటిన తర్వాత ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేద్దామంటూ కోహ్లి ముందుగానే సంకేతాలివ్వడంతో దాన్నే లక్ష్యంగా చేసుకుని విహారి, జడేజా, సాహాలు బ్యాట్‌ ఝుళింపించే యత్నం చేశారు. ఈ క్రమంలో విహారి విఫలం కాగా, జడేజా, సాహాలు మోస్తరుగా ఫర్వాలేదనిపించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌ మూడు వికెట్లు సాధించగా, ఫిలిండర్‌, డేన్‌ పీడ్త్‌, ముత్తుస్వామి, డీన్‌ ఎల్గర్‌లు తలో వికెట్‌ తీశారు. 

>
మరిన్ని వార్తలు